వాయుగుండంగా అల్పపీడనం: భారీ వర్షాలు, కుంగిన ఘాట్
విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం నుంచి వాయువ్యదిశగా కదిలి పూరి-గోపాలపురి మధ్య వాయుగుండం తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
దాంతో తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రెండు రాష్ర్టాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. కళింగపట్నం, విశాఖపట్నం, భీమునిపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో మూడో నెంబర్ హెచ్చరికలను జారీ చేశారు. వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ జాలర్లను హెచ్చరించింది.
జాలర్ల పడవలు గల్లంతు

కాకినాడ వద్ద సముద్రంలో చేపల వేట కోసం 20బోట్లలో వెళ్లిన మత్స్యకారులు గల్లంతయ్యారు. దీంతో గల్లంతైన వారికోసం ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా గాలింపు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర మంత్రి రావెల కిషోర్‌బాబు చెప్పారు. కాకినాడ కుంభాభిషేకం వద్ద తమ వారి కోసం ఎదురు చూస్తున్న మత్స్యకారుల కుటుంబాలను మంత్రి రావెల కిషోర్‌బాబు పరామర్శిచారు.
దాదాపు 20 బోట్లలో 60మంది మత్స్యకారులు నాలుగు రోజుల క్రితం సముద్రంలో చేపల వేటకు వెళ్లారని వారి ఆచూకీ కనుక్కోవడం కోసం అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. గత మూడు రోజుల నుంచి భారీగా వర్షం కురుస్తుండటంతో మత్స్యకారుల కోసం గాలించడం కష్టంగా మారిందని మంత్రి చెప్పారు. వర్షం తగ్గుముఖం పట్టిన అనంతరం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఏరియల్ సర్వే ద్వారా గాలింపు చేపట్టి మత్స్యకారులను సురక్షితంగా బయటకు తీసుకువస్తామని మంత్రి చెప్పారు.
కుంగిన ఘాట్, భయాందోళనలు
తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాల కారణంగా గోదావరి పుష్కరాల పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాలకు పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. రాజమండ్రి వద్ద గోదావరి నదిలోకి ఘాట్ కుంగిపోయింది. దీంతో ఆర్యపురం ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి కాకినాడలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రామకృష్ఱారావుపేట, సాంబమూర్తినగర్ , సినిమారోడ్డు, పోర్ట్ రైల్వేస్టేషను ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచింది.
బరాజ్ గేట్ల ఎత్తివేత
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ వద్ద 18 గేట్లను ఎత్తివేసిన అధికారులు 12 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. కృష్ణా తూర్పు, పశ్చిమ కాలువలకు 3500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
శ్రీకాకుళం జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాలకు నాగావళి నదికి గండి పడటంతో పాతకాజ్‌వే కొట్టుకుపోయింది. పాతబారికేజ్ నుంచి రాకపోకలు సాగించవద్దని అధికారులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications