భక్తులకు బిగ్ అలర్ట్- శ్రీవారి మెట్టు మూసివేత
Tirumala: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. వాయుగుండంగా మారింది. తీరం వైపు తరుముకొస్తోంది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తమిళనాడు ఉత్తరం- ఏపీ దక్షిణ ప్రాంతంలో తీరాన్ని దాటుతుందని తెలిపింది.
ప్రస్తుతం ఈ వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఇది వాయవ్య దిశగా కదులుతోంది. ఆ సమయంలో దీని వేగం గంటకు 15 కిలో మీటర్ల వరకు ఉంటోంది. ఈ ఉదయం వరకు చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 280 కిలో మీటర్లు, పుదుచ్చేరికి తూర్పు ఈశాన్య దిశగా 320, నెల్లూరుకు ఆగ్నేయ దిశగా 370 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.

దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించవచ్చనీ అంచనా వేసింది. లోతట్టు, పెన్నా నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇప్పటికే చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, కడప వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. వాయుగుండం తీరం దాటబోతోన్నందున ఈ అర్ధరాత్రి నుంచి వర్షాల తీవ్రత మరింత అధికంగా ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసింది.
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని మూసి వేయాలని నిర్ణయించారు. భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
వాతావరణ పరిస్థితులను బట్టి ఈ మార్గంలో భక్తులకు అనుమతి ఇస్తారు. ఇప్పటికే తిరుమలలో పాపవినాశనం, శిలాతోరణం మార్గాలను టీటీడీ మూసివేసిన విషయం తెలిసిందే. విపత్తుల నిర్వహణ ప్రణాళికపై టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు ఉన్నతాధికారులతో వర్చువల్‌గా సమావేశం అయ్యారు. పలు సూచనలు చేశారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు. కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఘాట్ రోడ్లలో వాహనాల రాకపోకలు స్తంభించిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శ్యామలరావు సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలకగకుండా చర్యలు చేపట్టాలని, ముందు జాగ్రత్తగా జనరేటర్లు, డీజిల్‌ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
వైద్య విభాగం సిబ్బంది అంబులెన్సులను అందుబాటులో పెట్టుకోవాలని, ఘాట్ రోడ్లలో జేసీబీలను సిద్ధంగా ఉంచుకోవాలని ఈఓ చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు, ఇంజినీరింగ్ సిబ్బందితో సమన్వయంతో పని చేయాలని, విపత్కర పరిస్థితులను ఎదుర్కొనడానికి అగ్ని మాపక, రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది వేగంగా స్పందించాలని అన్నారు.












Click it and Unblock the Notifications