బంగాళాఖాతంలో అల్పపీడనం: ఆంధ్రప్రదేశ్ భద్రమే
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా కదులుతున్న ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నాయి. అల్పపీడనం గురువాపరం సాయంత్రంలోగా మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. ప్రస్తుతానికి అల్పపీడనం ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై ఏ మాత్రం ఉండదని, మరో రెండు రోజుల పాటు ఈ రెండు రాష్ట్రాల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని అధికారులు అంటున్నారు.
కాగా, కోస్తాంధ్రలో సాధారణం కన్నా 2, రాయలసీమలో 3, తెలంగాణ 5 డిగ్రీల మేరకు రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో చలి అధికంగా ఉంటోంది. గత 24 గంటల్లో మెదక్, ఆదిలాబాద్ జిల్ాలల్లో 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి మంగళవారం ఉదయం అల్పపీడనంగా మారింది. విశాఖకు సుమారు 1150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అల్పపీడనం వాయుగుండంగా మారిన తరువాత వేగం పెంచుకుని ముందుకు కదిలే అవకాశం ఉంది. ఇది ఉత్తర కోస్తా, ఒడిశా వైపుగా కదిలే అవకాశం ఉంది.
ఈనెల 10 లేదా 11నాటికి వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలో అనేక చోట్ల 12 సెంటీ మీటర్లకు మించి వర్షాలు కురుస్తాయని చెపుతున్నారు. తుపానుకు అషుభా అని నామకరణం చేసినట్టు తెలుస్తోంది. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మాత్రం తుపాను గురించి ఇంకా స్పష్టమైన సమాచారం లేదని చెపుతున్నారు.












Click it and Unblock the Notifications