స్థానిక ఎన్నికల పై పవన్ కీలక ప్రకటన- జనసైనికుల "ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా"..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. స్థానిక ఎన్నికల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మూడు పార్టీలు సమన్వయంతో సీట్ల పంపకాల పైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాయి. ఇదే సమయంలో అటు వైసీపీ సైతం ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. అక్టోబర్ నెలాఖరు నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. సీట్ల సర్దుబాటు పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న వేళ స్థానిక ఎన్నికల పై పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
ఏపీలో ఇప్పుడు స్థానిక ఎన్నికల రాజకీయం మొదలైంది. స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు పైన జనసేన నుంచి ఈ సారి వాయిస్ బలంగా వినిపిస్తోంది. 2024 ఎన్నికల ఫార్ములా ఇప్పుడు ఈ ఎన్నికలకు వర్తించదని పార్టీ నేతలు తేల్చి చెబుతున్నారు. తమకు బలం ఉన్న చోట్ల పోటీ చేసి తీరుతామని జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. దీంతో, కూటమి లోని మూడు పార్టీల అధినేత లు కలిసి కూర్చొని సీట్ల పంపకాల పైన మాట్లాడుకుందామని చంద్రబాబు సూచించారు. కాగా.. ఇక, ఇప్పుడు జనసేన నుంచి సీట్ల పైన పెరుగుతున్న ఒత్తిడి వేళ అసెంబ్లీలోని జనసేన కార్యాలయ ప్రాగణంలో పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పవన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. స్థానిక ఎన్నికల పైన చర్చించారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్దం కావాలని సూచించారు. ఇదే సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.

పవన్ సంకేతాల వెనుక
జనసేన లెజిస్లేటర్ పార్టీ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల మీద అంతా కలసి లోతుగా చర్చించాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు తీసుకువెళ్తాం. pic.twitter.com/EBjYhIlhg2
— Pawan Kalyan (@PawanKalyan) August 20, 2026
సమావేశం తరువాత పవన్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో..'జనసేన లెజిస్లేటర్ పార్టీ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల మీద అంతా కలసి లోతుగా చర్చించాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ముందుకు తీసుకువెళ్తాం..' అని పవన్ స్పష్టం చేసారు. ఇందులో ప్రత్యేకంగా జనసైనికుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా అని చెప్పటం ద్వారా సీట్ల విషయంలో రాజీ ఉండదనే సంకేతాలు పవన్ ఇచ్చినట్లుగా స్పష్టం అవుతోంది. కాగా.. పవన్ ఇప్పటికే శస్త్ర చికిత్స తరువాత కొంత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో.. రేపు కేరళకు వెళ్తున్న పవన్.. 20 రోజుల పాటు కేరళలోని ప్రకృతి వైద్య చికిత్సా కేంద్రంలో చికిత్స చేయించుకోవాలని డిసైడ్ అయ్యారు. కాగా.. వచ్చే వారం స్థానిక ఎన్నికల్లో భాగంగా ముందుగా మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు పైన మూడు పార్టీల నేతలు సమావేశం కానున్నారు. పవన్ తాజా ట్వీట్ తో సీట్ల సర్దుబాటు వ్యవహారం మరింత ఆసక్తి కరంగా మారుతోంది.













Click it and Unblock the Notifications