గొడవ పెట్టుకుందామా?
Pawan Kalyan: వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు చెందన సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తల అరెస్టుల వ్యవహారంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తప్పు పట్టారు. పోలీసు వ్యవస్థను ఆయన బెదిరిస్తోన్నాడంటూ ఆరోపించారు.
ఈ సాయంత్రం ఆయన జనసేనకు చెందిన వివిధ సంస్థల కార్పొరేషన్ల ఛైర్మన్లతో సమావేశం అయ్యారు. వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి ఎలా మాట్లాడాడో చూశామని, సప్త సముద్రాలు దాటి వెళ్లినా తీసుకొస్తామంటూ పోలీసులను నేరుగా బెదిరించారని పేర్కొన్నారు.

వైసీపీ నాయకుల నుంచి వచ్చే ఇలాంటి ప్రకటనలు గానీ, సోషల్ మీడియాలో పోస్టులపై గానీ బలంగా స్పందించాలని పవన్ కల్యాణ్ వారికి సూచించారు. రాజకీయాలు అంటే ఆయుధాలు లేకుండా యుద్ధం చేయడంలాంటిదేనని పవన్ చెప్పారు. ఎలాంటి ఆయుధాలు లేకుండా యుద్ధం చేయగలిగితేనే రాజకీయాల్లోకి రావాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
తమ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో చాలా పద్ధతిగా పోస్టులు పెట్టాలని, తమ వాదనలను వినిపించాలని పవన్ కల్యాణ్ కార్పొరేషన్ల ఛైర్మన్లకు సూచించారు. విధాన పరంగా విమర్శలు చేయాల్సి ఉంటుందని, వాళ్ల కుటుంబ సభ్యుల జోలికి వెళ్లకూడదని కోరారు. వ్యక్తిగతంగా ఎలాంటి పోస్టులు వేయొద్దని అన్నారు.
తమ వాదనలను బలంగా, ప్రస్ఫూటంగా వినిపించగలగాలని, తప్పదనుకుంటే గొడవ పెట్టుకుందామని పవన్ చెప్పారు. గొడవ పెట్టుకునే స్థాయి కూడా వైసీపీకి లేదని సెటైర్లు వేశారు. సమాజంలో శాంతిభద్రతలు అత్యవసరమని, అదే లేకపోతే నిలబడలేమని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ కల్యాణ్ సూచించారు.
వైసీపీ నాయకులు, కార్యకర్తల తరహాలో బాధ్యతరహితంగా వ్యవహరించకూడదని, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా సబ్జెక్ట్ లేకుండా వారిలా మాట్లాడొద్దని చెప్పారు. ప్రజలకు సేవ చేయడానికి లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, హుందాగా వ్యవహరించాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
కార్పొరేషన్లకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే వాటిని తన పేషీ దృష్టికి తీసుకుని రావాలని పవన్ కల్యాణ్ చెప్పారు. నిధుల విడుదల వంటి అంశాలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని, సమష్టిగా తమకు కేటాయించిన వివిధ కార్పొరేషన్లను అభివృద్ధి చేయాలని అన్నారు.












Click it and Unblock the Notifications