"మరో 15 ఏళ్లకు తగ్గకుండా కూటమి ప్రభుత్వం బలంగా ఉండాలి"
కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా కర్నూలు శివారులోని నన్నూరులో ఏర్పాటు చేసిన 'సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్'సభలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నరు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలని అన్నారు. ప్రధాని మోదీ.. ప్రతి కుటుంబానికి పన్నుల భారాన్ని తగ్గించారని కొనియాడారు.
"దేశ సేవే పరమావధిగా ప్రజలకు సేవ చేస్తున్న ప్రధాని మోదీ ఓ నిజమైన కర్మయోగి. ఆయన కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే కాదు రెండు మూడు తరాల ప్రజలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా ప్రపంచ పటంలో దేశాన్ని నిలబెడుతున్నారు. గూగుల్ లాంటి అతిపెద్ద ప్రాజెక్టులు దేశానికి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయి. జీఎస్టీ 2.0 సంస్కరణలతో పేదలు, సామాన్యులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతోంది. జీవిత, ఆరోగ్య భీమా సహా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గటం వల్ల ప్రజలు ఆదా చేసుకోగలుగుతారు. కూటమి ప్రభుత్వం కనీసం 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలి. పెట్టుబడులు పరిశ్రమల నమ్మకాన్ని సడలించకుండా అంతా కలిసే ఉండి స్థిరమైన ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం" అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
అలాగే దేశ జెండా ఎంత పొగరుగా ఉంటుందో అలాగే దేశ పటాన్ని ప్రపంచపటంలో నిలబెట్టారని ప్రధాని మోదీని పవన్ కల్యాణ్ కొనియాడారు. దేశం తలెత్తి చూసే విధంగా ఆత్మనిర్భర్ భారత్ తీసుకువచ్చారని.. ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా పనిచేస్తున్నారని ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు పవన్ కల్యాణ్. ఇక ఇదే వేదిక నుంచి రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు.

అంతకుముందు శ్రీశైలం మల్లన్నను ప్రధాని నరేంద్రమోదీ దర్శించుకున్నారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీతోపాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ మల్లన్నను దర్శనం చేసుకున్నారు. ఈ మేరకు మల్లికార్జునస్వామికి పంచామృతాలతో ప్రధాని మోదీ రుద్రాభిషేకం నిర్వహించారు. దర్శనం అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను ప్రధాని మోదీ తిలకించారు.












Click it and Unblock the Notifications