మహారాజా ఆస్పత్రి పేరు మార్పు అందుకే- డిప్యూటీ స్పీకర్ కోలగట్ల- అశోక్ కు సవాల్..
విజయనగరంలోని మహారాజా ఆస్పత్రి పేరును ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా మారుస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనిపై వివాదం రేగుతోంది. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు తర్వాత తీసుకున్న ఈ నిర్ణయంపైనా విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్, స్ధానిక ఎమ్మెల్యే కూడా అయిన కోలగట్ల వీరభద్రస్వామి దీనిపై వివరణ ఇచ్చారు. ఇది మరింత అగ్గిరాజేసేలా కనిపిస్తోంది.
విజయనగరం ప్రభుత్వాసుపత్రికి "మహారాజా" పేరు ఎప్పుడూ లేదని, కేవలం రాజకీయ స్వార్థంతోనే టీడీపీ, లేనిది ఉన్నట్టుగా రాద్ధాంతం చేస్తుందని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల మండిపడ్డారు. ఆ ఆసుపత్రి శంఖుస్థాపన సమయంలోగానీ, ప్రారంభోత్సవం సందర్భంలోగానీ, ఆఖరికి టీడీపీ ప్రభుత్వం దిగిపోయే సమయంలో, అంటే 2019లో మెడికల్ కాలేజీని మంజూరు చేస్తూ ఇచ్చిన జీవోలోగానీ ఎక్కడా "మహారాజా" పేరు లేదని స్పష్టం చేశారు. లేని పేరును ఉన్నట్టుగా ప్రచారం చేయడమే కాకుండా, ప్రభుత్వాసుపత్రి స్థలం తమదే అన్నట్టుగా అశోక్ గజపతిరాజు ప్రచారం చేసుకోవడాన్ని కూడా కోలగట్ల తప్పుబట్టారు.

ప్రభుత్వాసుపత్రిలో అంగుళం స్థలం కూడా అశోక్ గజపతిరాజు వంశీకులది లేదని సాక్ష్యాధారాలతో సహా ఆయన స్పష్టం చేశారు. దమ్మూ, ధైర్యం ఉంటే, అది మీ స్థలం అని నిరూపించాలని చంద్రబాబుతోపాటు, అశోక్ గజపతిరాజు, లోకేష్ లకు కోలగట్ల సవాల్ విసిరారు. విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ నుంచి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు అప్పగించడం వల్ల.. జిల్లాకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంజూరు చేయడం, దాని ఆధీనంలో ప్రభుత్వాసుపత్రి ఉండాలన్న నిబంధనల మేరకు ఆ ఆసుపత్రిని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా మార్చినట్లు కోలగట్ల పేర్కొన్నారు. మెడికల్ కాలేజీ పనులను వేగవంతంగా పూర్తి చేసి, త్వరితగతిన తరగతులు ప్రారంభించాలన్న ఆలోచనతోనే, కావాల్సిన సౌకర్యాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమకూరుస్తున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష టీడీపీ నేతలు మహరాజా పేరు తొలగించారని రాద్ధాంతం చేస్తున్నారన్నారు . మీకు కేవలం రాజకీయాలే కావాలి తప్పితే.. అభివృద్ధి పట్టదా అని ప్రశ్నించారు.
హైదరాబాద్ లో మకాం ఉండే, పనీపాట లేని చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోకుండా.. ఇది తుగ్లక్ చర్య అంటూ ట్వీట్లు పెట్టాడని,వాస్తవాలేమిటంటే.. విజయనగరంలోని ఈ ఆసుపత్రికి 1983లో స్వర్గీయ ఎన్టీఆర్ శంఖుస్థాపన చేశారని కోలగట్ల తెలిపారు. ఆ కార్యక్రమానికి మహరాజా గారి ప్రథమ పుత్రుడు ఆనందగజపతిరాజు సభాధ్యక్షత వహించారని, 1988లో ఆసుపత్రి నిర్మాణం పూర్తైన తర్వాత, దానిని ఎన్టీఆరే ప్రారంభోత్సవం చేశారన్నారు. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కూడా ఆ వేదిక మీద ఉన్నారని, శంఖుస్థాపన సమయంలోగానీ, ప్రారంభోత్సవం సమయంలో గానీ, ఆ ఆసుపత్రికి మహరాజా గారు పేరు ఉందా..?. అంటే లేదన్నారు. 2019లో హడావుడిగా..టీడీపీ ప్రభుత్వం దిగిపోతున్న సమయంలో మెడికల్ కాలేజీ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తుత్తి జీవోలో కూడా మహారాజా పేరు లేదని కోలగట్ల తెలిపారు.
జిల్లా కేంద్రంగా విజయనగరం అవ్వకముందు, జిల్లా ఆసుపత్రి రాకముందు పాత ఆసుపత్రి దగ్గర మహారాజా గారి పేరు ఉండేదని, ఆ తర్వాత ప్రభుత్వ స్థలంలో, ప్రభుత్వ వైద్యశాలను నిర్మాణం చేశారన్నారు. ఆ తర్వాత కూడా మహరాజా గారి పేరుతో ప్రభుత్వ ఆసుపత్రి కొనసాగుతున్నా, పీవీజీ రాజు గారి మీద విజయనగరం ప్రజలకు ఉన్న అభిమానం, గౌరవంతో ఎవరూ ప్రశ్నించలేదన్నారు.