చంద్రబాబు ఇంటికే లంచం తీసుకున్న ఘనుడు ! చివరికి ఏమైందంటే..?
ఏపీలో అవినీతి ఏ స్థాయికి చేరిందని తెలియజేసే మరో ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎవరో క్షేత్రస్దాయిలో సామాన్యులు చిన్న ఇల్లు కట్టుకుంటామంటే తప్పనిసరిగా లంచాలు ఇస్తే కానీ పైలు ముందుకు కదలని ఘటనలు చూస్తూనే ఉంటాం. కానీ ఏకంగా రాష్ట్ర ప్రతిపక్ష నేత ఇంటి నిర్మాణ ఫైలును ముందుకు తీసుకెళ్లేందుకు లంచం డిమాండ్ చేయడమే కాకుండా తీసుకున్న ఘటన జరిగిందంటే ఆశ్చర్యపోక తప్పదు. ఇందులో బాధితుడు ప్రస్తుత సీఎం, గత విపక్ష నేత చంద్రబాబే.
చిత్తూరు జిల్లాలోని కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు డిప్యూటీ సర్వేయర్ గతంలో ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడు లంచం తీసుకున్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కుప్పంలోని శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద ఆయన స్థలాన్ని కొనుగోలు చేశారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో గృహ నిర్మాణం చేసేందుకు టీడీపీ నేతలు చంద్రబాబు తరఫున భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు చేశారు.

అలాగే స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరారు. దీనికి డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ రూ.1.80 లక్షల లంచాన్ని డిమాండ్ చేశారు. ఆ మొత్తం ఇవ్వడంతో ఫైలు ముందుకు కదిలింది. గత నెల 25, 26వ తేదీల్లో సీఎం హోదాలో చంద్రబాబు కుప్పానికి వచ్చినప్పుడు ఆయన బస చేసిన ఆర్అండ్ బీ అతిథిగృహం వద్ద స్థానిక నేతలతో ఆ విషయం చర్చకు వచ్చింది. దీనిపై కలెక్టర్ సుమిత్ కుమార్, జేసీ శ్రీనివాసులు ఆరా తీయగా లంచం బాగోతం వెలుగు చూసింది.
సర్వే శాఖ ఏడీ గౌస్ పాషాతో శాఖాపరమైన విచారణ చేయించగా, చంద్రబాబు ఇంటి సబ్ డివిజన్ అనుమతి కోసం సదరు డిప్యూటీ సర్వేయర్ డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని తేలింది. భూ సర్వే కోసం సద్దాం హుస్సేన్ రూ. లక్ష డిమాండ్ చేశారని గత నెల 27న శాంతిపురం మండలానికే చెందిన ఓ రైతు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపైనా విచారణ జరిపి, అది కూడా నిజమేనని నిర్ధారించారు. వీటిపై సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలని నిన్న జేసీ శ్రీనివాసులు సర్వే ఏడీని ఆదేశించారు. అనంతరం డిప్యూటీ సర్వేయర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.












Click it and Unblock the Notifications