రూటు మార్చిన జగన్ ? మోడీకి లోక్ సభ సాక్షిగా షాక్..!
ఏపీలో అధికార, విపక్ష పార్టీలు కేంద్రంలో ఎన్డీయేకు మద్దతుగా ఉన్నాయన్న చర్చ నేపథ్యంలో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకూ కేంద్రానికి అధికారిక భాగస్వామిగా ఉన్న టీడీపీ, అనధికారిక భాగస్వామిగా కొనసాగుతున్న వైసీపీ ఓ కీలక అంశంలో మాత్రం పార్లమెంట్ వేదికగా జరిగిన తమ స్టాండ్ ఏంటో తెల్చి చెప్పేశాయి. ఇందులో టీడీపీ స్టాండ్ తో ఇబ్బంది లేకపోయినా.. వైసీపీ స్టాండ్ తో మాత్రం బీజేపీతో పాటు మోడీ కూడా ఇరుకునపడ్డారు.
రాష్ట్రంలో గతేడాది ఎన్నికల్లో ఓటమి పాలైన వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయినా కేంద్రం తెచ్చిన పలు బిల్లులతో పాటు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి అండగానే నిలిచింది. అయితే నిన్న ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో మాత్రం రెండు కీలక అంశాలపై వైసీపీ తన స్టాండ్ చెప్పేసింది. ఇందులో ఒకటి ఈవీఎంలు కాగా.. మరొకటి ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ.

ఎన్నికల సంస్కరణలపై లోక్ సభలో జరిగిన చర్చలో అధికార ఎన్డీయే సభ్యులు కేంద్రానికి మద్దతుగా ప్రసంగాలు చేస్తున్నారు. అలాగే విపక్ష ఇండియా కూటమి సభ్యులు ఓట్ల చోరీ, ఎస్ఐఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ముందుగా ఈవీఎంలపై స్పందించారు. ఎన్నికల ప్రక్రియపై తమకు అనుమానాలు ఉన్నాయని, గత ఎన్నికల్లో సాయంత్రం 6 గంటల తర్వాత అసాధారణంగా 15 శాతం పోలింగ్ పెరిగిందని, ఒడిశాలోనూ ఇలాగే జరిగిందని, దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. సీసీ ఫుటేజ్ కూడా ఇవ్వలేదన్నారు.

యూరప్ సహా ప్రపంచదేశాలు ఈవీఎంల నుంచి బ్యాలెట్ కు మారుతున్నాయని, ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చని ఎలాన్ మస్క్ చెప్పారని మిథున్ రెడ్డి గుర్తుచేశారు. తాను మూడుసార్లు ఈవీఎంలతోనే గెలిచినా వాటిపై అనుమానాలు ఉన్నాయన్నారు. అలాగే ఎస్ఐఆర్ పై స్పందిస్తూ.. సమాజంలోని అన్ని వర్గాలకు అంగీకారమైతే వైసీపీకీ అంగీకారమేనని మిథున్ తేల్చిచెప్పేశారు. దీంతో ఎస్ఐఆర్ కు వైసీపీ వ్యతిరేకంగా ఉన్నట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications