దేవరగట్టు కర్రలసమరం రక్తసిక్తం: 100మందికి పైగా గాయాలు; ఒకరు మృతితో విషాదం!!
దేవరగట్టు బన్నీ ఉత్సవం ఎప్పుడు జరిగినా విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సంవత్సరం కూడా దసరా పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే కర్రల సమరం మరోమారు రక్తాన్ని చిందించింది. బన్నీ ఉత్సవం పేరుతో సాగిన కర్రల సమరం 100 మందికి పైగా జనాలను గాయాలపాలు చేసింది. దేవరగట్టులో జరిగే కర్రల సమరంలో ఈ సంవత్సరం ఒకరు మృతి చెందారు.
మృతుడు ఆస్పరికి చెందిన బాల గణేష్ గా గుర్తించారు. దీంతో దేవరగట్టు కర్రల సమరంలో విషాదం మిగిలింది.ఈ సంవత్సరం దేవరగట్టు ఉత్సవానికి దాదాపు 2 లక్షల మంది హాజరయ్యారు. దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి విగ్రహం కోసం రెండు వర్గాలకు చెందిన వారు వేలాదిమంది కర్రల సమరం చేస్తారు. స్వామివారిని తీసుకు వెళ్లడం కోసం ఇరువర్గాలు కర్రలతో కొట్టుకుంటారు.

సాంప్రదాయ ఉత్సవం పేరుతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటారు. ఇందులో భాగంగా ఇనుప రింగులు ఉన్న కర్రలతో బన్నీ ఉత్సవం మొదలు కాగా, ఆ సమయంలో కొందరు కాగడాల దివిటీలను గాలిలోకి ఎగరవెయ్యటంతో గొడవ జరిగింది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు వచ్చిన కొందరు చెట్టుపైకి ఎక్కి కూర్చోగా చెట్టు కొమ్మ ఒక్కసారిగా విరిగి పడింది. దీంతో చెట్టు క్రింద ఉన్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అప్పుడు జరిగిన తొక్కిసలాటలో 100 మందికి పైగా గాయపడ్డారు. ఇక సాంప్రదాయ ఉత్సవం హింసాత్మకంగా మారడంతో ఈ ఉత్సవాన్ని రద్దు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించింది. అయినప్పటికీ అనాదిగా సంప్రదాయ ఉత్సవంలో భాగంగా తాము కర్రల సమరం చేస్తున్నామని, ఈ సంప్రదాయాన్ని విడిచిపెట్టేది లేదని దేవరగట్టు వాసులు తేల్చిచెప్పారు.
అయితే దేవరగట్టు కర్రల సమరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా అది విఫలం అవుతూనే ఉంది. ఇక తాజాగా నిన్న దసరా రోజు జరిగిన కర్రల సమరంలో హింసాత్మక ధోరణి చోటుచేసుకుంది. కర్రల సమరంలో భాగంగా కొట్టుకున్న ఇరు వర్గాలకు చెందిన వారి తలలు పగిలాయి. దేవరగట్టు కర్రల సమరం రక్తసిక్తమైంది. 100 మందికి పైగా గాయాలపాలు కాగా ఈ ఘటనలో గాయపడిన భక్తులకు అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందించి, ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications