విజయవాడ ఈస్ట్ లో వార్ మొదలుపెట్టేసిన అవినాష్-టికెట్ కన్ఫమ్ కాగానే-గద్దె టార్గెట్ గా పోరు..
విజయవాడ రాజకీయాల్లో కీలకమైన తూర్పు సీటులో రాజకీయం రాజుకుంటోంది. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ పై గుడివాడలో పోటీ చేసి ఓడిపోయి, అనంతరం వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చి విజయవాడ తూర్పు టికెట్ కన్ఫమ్ చేసుకున్న దేవినేని అవినాష్.. ఇప్పుడు అక్కడ రాజకీయం మొదలుపెట్టేశారు. గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో స్ధానికుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో తన అనుచరులతో ఎదురుదాడి చేయించి తానేంటో చూపించారు. దీంతో ఎమ్మెల్యే కాకుండానే ఇలా చేస్తే భవిష్యత్తులో ఎలా అంటూ ప్రత్యర్ధి గద్దె సెటైర్లు వేస్తున్నారు.

విజయవాడ తూర్పులో
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా గద్దె మాత్రం దాన్ని తట్టుకుని తూర్పు సీటులో గెలిచారు. దీంతో ఈసారి ఎలాగైనా ఈ సీటును వైసీపీ ఖాతాలో వేసుకునేందుకు జగన్ తాజాగా వ్యూహం రచించారు. దీని ప్రకారం ఇప్పటికే అక్కడ వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న దేవినేని అవినాష్ ను రంగంలోకి దించారు. దీంతో అవినాష్ కూడా వార్ మొదలుపెట్టేశారు. ఇప్పుడు గద్దెను గద్దెదింపి తూర్పు సీటులో పాగా వేయడం అవినాష్ ముందున్న లక్ష్యం.

అవినాష్ వర్సెస్ గద్దె రామ్మోహన్
విజయవాడ తూర్పు సీటులో ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ ను అక్కడ ఓడించడం అంత సులువు కాదు. రాజకీయాల్లో సౌమ్యుడిగా పేరున్న గద్దె రామ్మోహన్ కు ఆయన సొంత సామాజిక వర్గంతో పాటు ఇతర వర్గాల్లోనూ మంచి పేరుంది. రాజకీయ విమర్శల కంటే అభివృద్ధికే ఎక్కువ పరిమితం అవుతారనే పేరుంది. దీంతో ఆయన్ను ఎదుర్కొని విజయవాడ తూర్పు సీటులో పాగా వేసేందుకు అవినాష్ ఇప్పుడు పెద్ద వ్యూహమే రచించాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి తొలి అడుగు వేసేశారు దేవినేని అవినాష్.

గడప గడపతో మొదలుపెట్టిన అవినాష్
తాజాగా గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం కోసం విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే రాణిగారి తోటకు వెళ్లిన దేవినేని అవినాష్ కు అక్కడ టీడీపీ సానుభూతిపరులైన స్ధానికుల నించి నిరసన వ్యక్తమైంది. దీంతో వెనక్కి తగ్గని అవినాష్.. తన అనుచరులైన వైసీపీ కార్యకర్తల సాయంతో వారిపై దాడులకు దిగారు. ఈ క్రమంలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. అంతే కాదు టీడీపీ కార్యకర్తల్ని పోలీసుల సాయంతో అరెస్టులు కూడా చేయించారు. దీంతో విజయవాడ తూర్పులో రాజకీయం రాజుకుంది.

అవినాష్ ఎమ్మెల్యే అయితే..
వైసీపీ నేతల దాడిలో గాయాల పాలై, కృష్ణలంక పోలీసు స్టేషన్ లో ఉన్న టీడీపీ కార్యకర్తల్ని ఇవాళ గద్దె రామ్మోహన్ పరామర్శించారు. అనంతరం అవినాష్ పై గద్దె తీవ్ర విమర్శలు చేశారు. ప్రశ్నించిన మహిళపై దేవినేని అవినాష్ అనుచరులే దాడి చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. ఎమ్మెల్యే కాకుండానే వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా అవినాష్ ఇంతలా రౌడీయిజం చేస్తున్నాడని, రేపు పొరపాటున ఎమ్మెల్యేగా గెలిస్తే బెజవాడ ఏమైపోతుందో ప్రజలు ఆలోచన చేయాలని గద్దె వ్యాఖ్యానించారు. గతంలో ఎన్టీఆర్ భవన్, టీడీపీ నేత పట్టాభి ఇంటిపై జరిగిన దాడుల్లోనూ అవినాష్ హస్తం ఉందని గద్దె ఆరోపించారు. ఇలా దాడులకు దిగితేనే పార్టీలో భవిష్యత్తు ఉంటుందని జగన్ చెప్పినట్లుందని గద్దె తెలిపారు.












Click it and Unblock the Notifications