కెసిఆర్ చెప్పినవి అబద్ధాలే: చంద్రబాబు ఆ హామీ ఇవ్వలేని దేవినేని
విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ముంపు గ్రామాల బదలాయింపుపై కేసీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.
పోలవరం ముంపు మండలాల్లోని ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు బదలాయించేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తమకు హామీ ఇచ్చారని గతంలో ఓసారి చెప్పిన కేసీఆర్... శుక్రవారం మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించారన్నారు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు.

శనివారం ఉదయం విజయవాడలో ఓ న్యూస్ ఛానెల్‌తో మంత్రి దేవినేని మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలోని కొన్ని మండలాలు ఏపీలో కలిశాయని దేవినేని చెప్పారు. ఈ ముంపు మండలాలు ఏపీ పరిధిలో ఉంటేనే ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు పునరావాస కార్యక్రమాలు సంపూర్ణమవుతాయని దేవినేని చెప్పారు.
ఐదు గ్రామాలను తెలంగాణకు బదలాయించేందుకు చంద్రబాబు హామీ ఇచ్చారని కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి హామీని చంద్రబాబు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. చట్టప్రకారం తెలంగాణ నుంచి ఏపీలో కలిసిన ఏ ఒక్క గ్రామాన్ని కూడా తెలంగాణకు బదలాయించేది లేదని కూడా దేవినేని ఉమామహేశ్వరరావు తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications