ఫస్ట్.. మీరు క్షమాపణలు చెప్పండి: ఆ కేంద్రమంత్రులతో రాజీనామా చేయించండి
దేశంలో విద్యా విధానం దెబ్బతినడం, పరీక్షల నిర్వహణ తీరు పూర్తిగా పతనం కావడంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీల వల్ల లక్షలాదిమంది విద్యార్థులు తమ భవిష్యత్తుపై తమకే పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన ఎండగట్టారు. తమ హక్కుల సాధన కోసం విద్యార్థులు వీధుల్లోకి వచ్చి చేస్తోన్న ఆందోళనలు ముమ్మాటికీ న్యాయమైనవని స్పష్టం చేశారు.
కొద్దిసేపటి కిందటే రాహుల్ గాంధీ ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. వ్యవస్థీకృతంగా ఉన్న పరీక్షల నిర్వహణ విధానాలను కేంద్రం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు అయోమయంలో పడినా కూడా ప్రధాని మోదీ మౌనం వహించడం సరికాదని అన్నారు. ఈ వైఫల్యాలపై పూర్తి బాధ్యతను వహిస్తూ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసన తెలియజేస్తోన్న యువతపై పోలీసుల అణచివేత చర్యలను వెంటనే నిలిపివేయాలని అన్నారు.

యువతకు ఉపాధి అవకాశాలు లభించే అన్ని ద్వారాలను కూడా కేంద్రం క్రమక్రమంగా మూసివేస్తోందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత పారదర్శకంగా జరగాల్సిన పోటీ పరీక్షలను కూడా లీకేజీల రూపంలో చిన్నాభిన్నం చేశారని విమర్శించారు. దేశంలో అదానీ, అంబానీల వంటి పెద్ద కార్పొరేట్ శక్తుల ప్రాభవం విపరీతంగా పెరిగిపోతోందని, మరోవైపు యావత్ విద్యా వ్యవస్థను ఆర్‌ఎస్‌ఎస్ తన గుప్పెట్లోకి తీసుకుంటోందని ఆరోపించారు.
కనీస అర్హత లేని ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకులను యూనివర్శిటీల్లో వైస్ ఛాన్సలర్లుగా నియమిస్తూ విద్యా ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నారని విమర్శించారు. లీకేజీలపై ధర్మేంద ప్రధాన్ రాజీనామా చేస్తే సరిపోదని, శాంతియుత నిరసనకారులపై లాఠీచార్జీలకు కారణమైన అమిత్ షా కూడా తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ మొత్తం పరిణామాలకు ప్రధానమంత్రి కేంద్ర బిందువు అని అంతిమ బాధ్యత ఆయనే వహించాలని అన్నారు.












Click it and Unblock the Notifications