కాపుల భారీ సభ, రిజర్వేషన్లు - కీలక మలుపు..!!
ఏపీలో కాపు సామాజిక వర్గం కేంద్రంగా కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వైసీపీ కాపు నేతలు సమావేశం నిర్వహించారు. ఇప్పుడు విజయవాడ కేంద్రంగా కాపు సభ నిర్వహణకు టీడీపీ నేతలు సమాయత్తం అవుతున్నారు. ముద్రగడ సంస్మరణ సభ వేళ కాపు నేతలు తమ భవిష్యత్ కార్యాచరణ పైన చర్చించారు. కాపుల ఐక్యత.. హక్కులు.. రిజర్వేషన్ల పైన కలిసి కట్టుగా పోరాటం చేయాలని డిసైడ్ అయ్యారు. బోండా ఉమా నిర్వహించే సభకు తాను హాజరవుతానని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రకటించారు.
ఏపీలో ఇప్పుడు మరో కాపు రాజకీయం కాక రేపుతోంది. కొద్ది రోజుల క్రితం వైసీపీ కాపు నేతలు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ముద్రగడ పద్మనాభం మరణంతో ఆయన సంస్మరణ సభ వేళ పార్టీలకు అతీతంగా కాపు నేతలు రాజమండ్రిలో జరిగిన సభలో పాల్గొన్నారు. ముద్రగడ ఆశయాల సాధన కోసం కలిసి కట్టుగా పని చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో విజయవాడలోనూ ఇలాంటి సమావేశమే నిర్వహించారు. కాపుల ఐక్యతను చాటేలా విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాపు సంఘాల నాయకులు నిర్ణయించారు. కాపులంతా రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ముద్రగడ పద్మనాభం భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తానని ప్రకటించారు. కాపు సమాజం భవిష్యత్ కార్యాచరణ కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

విజయవాడలో సభ నిర్వహణకు నిర్ణయం
కాగా, వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కీలక వ్యాఖ్యలు చేసారు. బోండా ఉమా మీటింగ్ కి కచ్చితంగా వెళ్తానని వెల్లడించారు. అందరం కలిసి మీటింగ్ ఏర్పాటు చేయాలని అనుకున్నా మని.. కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతాం అన్ని పార్టీలు మద్దతు కోరతామని చెప్పారు. రిజర్వేషన్లు అనేవి ఒక పార్టీతో ,వ్యక్తితో అయ్యే పని కాదని వ్యాఖ్యానించారు. అందరి మద్దతు కావాలని పేర్కొన్నారు. ముద్రగడతో కలిసి పని చేసిన వాళ్లందరూ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. కాపుల గురించి ఎవరు సమావేశాలు పెట్టినా వెళతానని.. టిడిపి కాపులు వైసీపీ కాపులు అంటూ ఉండరు.. పార్టీని బట్టి కులం రాదని వ్యాఖ్యానించారు. కాపు నేతల మధ్య ఎటువంటి ఫైటింగ్ లేదని స్పష్టం చేసారు. దీంతో.. ఇప్పుడు కాపు నేతల వరుస ప్రకటనలు.. సభల తో ఏపీ రాజకీయం కొత్త మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications