ఏకపక్షంగా జలదోపిడీ సాగుతున్నా..హైదరాబాద్ లో ఆస్తుల కోసమే జగన్ సంయమనం: దేవినేని ఉమా ధ్వజం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు ముదురుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలపై నిప్పులు చెరుగుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం పెద్ద డ్రామా అని, కావాలనే ఇరు రాష్ట్రాల సీఎంలు ఆడుతున్న పెద్ద నాటకమని టీడీపీ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. జగన్ తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.

ఏకపక్షంగా నీటి విడుదల జరుగుతుంటే సీఎం జగన్ ఎందుకు మాట్లాడలేరు
రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ ఇద్దరు తోడుదొంగలు అని ఇప్పటికే కేశినేని నాని విమర్శించగా, తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఇరు రాష్ట్రాల మంత్రులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో స్పందించిన దేవినేని ఉమా కూడా ఫైర్ అయ్యారు. ఏకపక్షంగా నీటి విడుదల జరుగుతుంటే సీఎం జగన్ ఎందుకు మాట్లాడలేక పోతున్నారని నిప్పులు చెరిగారు .ఇదే సమయంలో ఈ సంయమనానికి కారణం పక్క రాష్ట్రంలో ఉన్న మీ ఆస్తులను కాపాడుకోవటమేనా అంటూ జగన్ ను నిలదీశారు . సీఎం జగన్ ను దేవినేని ఉమా టార్గెట్ చేశారు.

తన ఆస్తుల కోసమే జగన్ సైలెంట్
హైదరాబాద్లో తమ ఆస్తులు కాపాడుకోవడం కోసం జగన్ సైలెంట్ గా ఉన్నారని దేవినేని అసహనం వ్యక్తం చేశారు.అపెక్స్ కౌన్సిల్లో తీర్మానమైన కేఆర్ఎంబీ నియంత్రణ పరిధిని ఎందుకు నోటిఫై చేయడంలేదు?అని ప్రశ్నించిన దేవినేని ఉమా, విద్యుత్ ఉత్పత్తి, నీటి విడుదల ఏకపక్షంగా జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారో చెప్పాలన్నారు.
మీ జలదీక్ష, కాళేశ్వరం సందర్భాలలో కూడా కూడా మనోళ్లు ఉన్నారుకదా? అప్పుడు గుర్తు రాని మనోళ్ళు ఇప్పుడే గుర్తొచ్చారా ? అంటూ ప్రశ్నించారు. ఇప్పటికే కేశినేని నాని తనదైన శైలిలో పదునైన వాగ్బాణాలు సంధిస్తే దేవినేని ఉమా సైతం అదే బాటలో పక్క రాష్ట్రం లో జగన్ ఆస్తుల కోసమే సైలెంట్ గా ఉన్నారని విమర్శించారు.

హైదరాబాద్ లో గతంలోనూ తెలుగు వారున్నారు .. గుర్తు లేదా ?
హైదరాబాదులో తెలుగు వారు ఉన్నారు కనుక తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై ప్రశ్నించ లేక పోతున్నామని సీఎం అని చెప్పడం విడ్డూరంగా ఉందని ఇప్పటికే దేవినేని ఉమా తీవ్ర విమర్శలు చేశారు. సీఎంతో పాటు మంత్రుల ఆస్తులు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరు గట్టిగా నోరు తెరవడం లేదని దేవినేని ఉమ విమర్శించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలుగువారు ఉన్నారని గుర్తు చేశారు. కర్నూల్ లో జలదీక్ష చేసినప్పుడు, కాళేశ్వరం ప్రారంభానికి వెళ్ళినప్పుడు ప్రగతిభవన్ లో భోజనం చేసినప్పుడు, అప్పుడు కూడా పక్క రాష్ట్రంలో తెలుగువారు ఉన్నారని గుర్తు చేశారు .

ఆస్తుల కోసం రైతుల ప్రయోజనాలు తెలంగాణాకు తాకట్టు
ఇంకా లక్ష కోట్ల ఆస్తులు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంపకం జరగాల్సి ఉండగా, 10 వేల కోట్లు విద్యుత్ బకాయిలు రావాల్సి ఉండగా వాటి గురించి జగన్ ప్రశ్నించలేదని, పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాయలసీమ బిడ్డ గా రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాల్సిన జగన్, సైలెంట్ గా ఉండి రాయలసీమ ద్రోహి గా మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిఐ, ఈడి కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని, ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్న ఆస్తుల కోసం రాష్ట్ర ప్రజల రైతుల ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెడుతున్నారని సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు దేవినేని ఉమా.












Click it and Unblock the Notifications