పవన్‌కు అందుకే టీడీపీపై కోపం, జగన్ బీజేపీతో కుమ్మక్కై..: మంత్రి దేవినేని మండిపాటు
పశ్చిమగోదావరి: ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. పశ్చిమగోదావరి జిల్లా జానంపేట వద్ద పోలవరం కుడికాల్వకు దేవినేని మంగళవారం హారతి కార్యక్రమం నిర్వహించారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వలేదని, ప్యాకేజీ ఇస్తామని చెప్పి పనులు చేయలేదని కేంద్రంపై మంత్రి ఉమ మండిపడ్డారు. అందుకే, కేంద్రమంత్రుల పదవులు రెండూ వదిలేసి కేంద్రం నుంచి బయటకొచ్చేశామని చెప్పారు.

ఎన్డీఏ నుంచి తాము బయటికి రావడంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు కోపమొచ్చిందని అన్నారు. అందుకే ఇప్పుడు పవన్ రోడెక్కారని అన్నారు. ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. బీజేపీతో కుమ్మక్కై ఏపీ సీఎం చంద్రబాబును తిడుతున్నారని ధ్వజమెత్తారు.
68ఏళ్ల వయసులోనూ చంద్రబాబు కష్టపడుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతుంటే.. వీళ్లందరూ తట్టుకోలేకపోతున్నారని మంత్రి దేవినేని విమర్శించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా ఎంతో కష్టపడుతున్నారని. అయినా ఆయన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. పని చేసే కలెక్టర్‌ను కూడా విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications