సింహాచలం భక్తులకు అక్షయతృతీయ నాడు స్వామివారి నిజరూప దర్శనం..
ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో సింహాచలం అప్పన్న స్వామి ఆలయం ఒకటి. అప్పన్న స్వామి ఆలయంలో చందనోత్సవం కార్యక్రమం ఎంతో వైభవంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా తెల్లవారుజాము 3 గంటల నుంచి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూపాన్ని భక్తులు దర్శించుకుంటున్నారు. స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు భారీ క్యూ కట్టారు.
వైజాగ్‌లోని సింహాచలం అప్పన్నస్వామి ఆలయ చందనోత్సవ కార్యక్రమానికి ముందుగా ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆ తర్వాత స్వామివారి తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తుల్ని స్వామి వారి దర్శనానికి అనుమతించారు. స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు వేకువజాము నుంచే బారులు తీరారు. స్వామి వారి నిజరూప దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిజరూప దర్శనానికి విచ్చేసిన భక్తులు ముందుగానే టికెట్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో విక్రయించడం జరిగింది. ఈ టికెట్లు లేని భక్తులు ఉచిత దర్శనం ద్వారా క్యూ లైన్లలో నుంచి స్వామివారిని దర్శన భాగ్యం చేసుకోవచ్చు.

వేకువజాము నుంచే చందనోత్సవ కార్యక్రమాలు..
ఇదిలా ఉండగా, శుక్రవారం వేకువజాము నుంచి చందనోత్సవ వైదిక కార్యక్రమాలను ఎంతో వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు చందోనత్సవ వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఆలయంలో నిత్యం జరిపే సుప్రభాత సేవ అనంతరం వెండి బొరుగుతో స్వామిపై ఉన్న చందనాన్ని ఒలిచారు అర్చకులు. అనంతరం ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. స్వామి వారి తొలి దర్శనాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజుకు అందజేశారు. అనంతరం పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు.
1008 కలశాలతో నీరు..
ప్రతి సంవత్సరం సింహాచలం అప్పన్నస్వామి ఆలయానికి అక్షయ తృతీయ రోజున నిర్వహించే చందనోత్సవం ఎంతో విశిష్టమైనది. ఆలయంలో ఇవాళ రాత్రి 9 గంటల నుంచి సహస్ర ఘటాభిషేకం వైభవంగా జరగబోతోంది. శ్రీ వైష్ణవస్వాములు గంగధార నుంచి 1008 కలశాలతో నీటిని తీసుకొచ్చి నృసింహస్వామి వారి నిజరూపాన్ని అభిషేకిస్తారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు తొలివిడత చందనాన్ని సమర్పించడం జరుగుతుంది.












Click it and Unblock the Notifications