టీటీడీ ఈఓను ఏదైనా అడగాలనుకుంటున్నారా- రేపే: నంబర్ ఇదే
Tirumala: కలియుగ వైకుంఠంలా అలరారుతున్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం నాడు 67,091 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 21,111 మంది తలనీలాలను సమర్పించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.42 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 18 కంపార్ట్ మెంట్టు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనానికి 18 నుండి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు.

శ్రీవారి సేవను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ దిశగా టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. శ్రీవారి సేవ వ్యవస్థపై తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జాయింట్ ఈవో వీరబ్రహ్మంతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేశారు. శ్రీవారి సేవకులకు మెరుగైన శిక్షణ ఇవ్వడం ద్వారా తిరుమలకు వచ్చే వేలాది మంది భక్తులకు మరిన్ని సౌకర్యాలను అందించవచ్చని అన్నారు.
టీటీడీ చేపట్టిన చర్యలపై భక్తుల నుంచి మరింత ఫీడ్ బ్యాక్ తీసుకోవడంలో భాగంగా డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 7వ తేదీ ఏర్పాటు కానుంది. శుక్రవారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. దీన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
ఈ కార్యక్రమం ద్వారా శ్రీవారి భక్తులు తమ సందేహాలు, సూచనలు, సలహాలను టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ కు ఫోన్ ద్వారా తెలియజేయవచ్చు. ఆయనతో నేరుగా మాట్లాడవచ్చు. దీనికోసం భక్తులు సంప్రదించవలసిన నంబరు 0877-2263261. ఈ నంబర్ కు ఫోన్ చేసి.. నేరుగా అనిల్ కుమార్ సింఘాల్ తో మాట్లాడే అవకాశాన్ని కల్పించింది టీటీడీ.
కాగా- తిరుమలలో బుధవారం రాత్రి కార్తీకపౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. సాయంత్రం 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వేలాాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యత ఉంది.












Click it and Unblock the Notifications