తెలంగాణ హీట్: ధిక్కరిద్దామన్నగంటా, నో చెప్పిన నేతలు
న్యూఢిల్లీ/హైదరాబాద్: సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలలో ఏకాభిప్రాయం కుదరనట్లుగా కనిపిస్తోంది. సిడబ్ల్యూసి నిర్ణయం, తాజాగా కేబినెట్ నోట్ హీట్ అంశాలపై పలువురు నేతలు గురువారం మంత్రుల క్వార్టర్సులో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.
నేతల సమావేశం కొనసాగుతుండగా మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, కాసు వెంకట కృష్ణా రెడ్డిలు బయటకు వచ్చి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసేందుకు వెళ్లారు. తమది సమైక్య నినాదమేనని, దానిని అధిష్టానానికి చెప్పాలని కిరణ్‌ను కోరనున్నట్లు టిజి చెప్పారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు.

మరోవైపు సీమాంధ్ర నేతల సమావేశం హాట్ హాట్‌గా సాగుతోంది. అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరిద్దామని మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పగా పలువురు నేతలు వ్యతిరేకించినట్లుగా తెలుస్తోంది. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉందామని అయితే సమైక్యవాదం మాత్రం బలంగా వినిపిద్దామని సూచించారు. ఎపిఎన్జీవోల తీరును మరో మంత్రి సి రామచంద్రయ్య తప్పు పట్టారు.
డొక్కాకు విహెచ్ కితాబు
కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు న్యూఢిల్లీలో మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు కితాబిచ్చారు. ఆయన దారిలోనే మిగిలిన మంత్రులు నడవాలన్నారు. విభజనపై నాలుగేళ్లుగా ఎన్నోసార్లు చర్చలు జరిగాయన్నారు. తెలంగాణ వద్దని చెబుతున్న చంద్రబాబు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో ఎందుకు కలిశారన్నారు.












Click it and Unblock the Notifications