మేయర్ పోస్ట్‌పై టిడిపిలో విభేదాలు, వైసిపికి ఛాన్స్: చంద్రబాబు వల్లేనా?
చిత్తూరు: చిత్తూరు మున్సిపల్ కార్పోరేషన్‌లో ఆసక్తికర రాజకీయం కనిపిస్తోంది. పది నెలల క్రితం చిత్తూరు నాటి చిత్తూరు మేయర్ కటారి అనురాధ హత్యకు గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ పోస్ట్ ఖాళీగా ఉంది. ఇందుకు అధికార టిడిపిలోని గ్రూపు తగాదాలే కారణమని చెబుతున్నారు.
ఇది ప్రతిపక్ష కార్పోరేటర్లకు వరంలా పరిణమించిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఇంఛార్జ్ మేయర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న డిప్యూటీ మేయర్.. గ్రూపుల గొడవలతో వేగలేకపోతున్నారు. ఆ బాధ్యతల నుంచి విముక్తి కావాలని కోరుకంటున్నారట.
చాలాకాలం నుంచి ఖాళీగా ఉన్న మేయర్ స్థానానికి ఎన్నిక జరిపించాలని కొందరు కార్పోరేటర్లు హైకోర్టుకు వెళ్లారు. మేయర్ పీఠం కోసం ఎవరికి వారు.. ఆయా గ్రూపులు పావులు కదుపుతున్నాయని చెబుతున్నారు. దీంతో రోజుకో మలుపు తిరుగుతోంది.

మేయర్ పీఠం కోసం ఏ గ్రూపుకు ఆ గ్రూపు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తోందట. పైరవీలు చేస్తోందని అంటున్నారు. టిడిపిలోని గ్రూపు విభేదాలను వైసిపి అవకాశంగా తీసుకుంటుందని చెబుతున్నారు. మేయర్ పీఠం పైన సీఎం చంద్రబాబు సత్వర నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కొందరి వాదనగా ఉంది.
మేయర్ పదవిని హత్యకు గురైన అనురాధ కుటుంబానికే దక్కుతుందా, లేదా అనేది సందిగ్ధంగా మారింది. గత ఏడాది నవంబర్ 17వ తేదీన మేయర్ అనురాధతో పాటు భర్త కటారి మోహన్ పైన దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో వారు మృతి చెందారు. నాటి నుంచి మేయర్ పీఠం పైన సంధిగ్ధత నెలకొంది.
చిత్తూరు నగర పాలక సంస్థగా ఆవిర్భవించిన తర్వాత మేయర్ పీఠాన్ని తొలిసారి బీసీ మహిళకు ఇచ్చారు. 50 డివిజన్లు కలిగిన చిత్తూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో మొత్తం 33 స్థానాలను టిడిపి గెలుచుకుంది. దీంతో అనురాధ మేయర్ అయ్యారు. ఆమె హత్య అనంతరం గ్రూపు రాజకీయాలతో మేయర్ పీఠం అంశం తెగడం లేదు.












Click it and Unblock the Notifications