విలీనం చేసినా: పవన్ పార్టీపై డిగ్గీ, కిరణ్ మాట తప్పారు
న్యూఢిల్లీ: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీ పెడతారనే వార్తల నేపథ్యంలో ఆ అంశంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ శనివారం స్పందించారు. పవన్ పార్టీ పెడితే తాము స్వాగతిస్తామని చెప్పారు. పవన్ తన పార్టీని భవిష్యత్తులో కాంగ్రెసులో విలీనం చేస్తామన్నా తాము స్వాగతిస్తామని చెప్పారు.
ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పార్టీ పెట్టనని ప్రామిస్ చేసి మాట తప్పారని ఆరోపించారు. పొత్తుల పైన ఆయన మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తులపై సంప్రదింపులు జరుపుతున్నామని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. సోమవారం తెరాస నేత కె కేశవ రావు ఢిల్లీ వస్తున్నారని, ఆయనతో సంప్రదింపులు జరిపాక నిర్ణయం ఉంటుందని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ప్రత్యేక పిసిసిలను ఏర్పాటు చేస్తామన్నారు. పిసిసి ఏర్పాటుపై చర్చలు తుది దశలో ఉన్నాయని చెప్పారు. పిసిసిల ప్రటన తర్వాత సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో పర్యటిస్తామని చెప్పారు.
మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ శనివారం సూటి ప్రశ్న సంధించారు. తెలంగాణను ఇవ్వడమే తప్పైతే, బిల్లుకు మద్దతిచ్చిన భారతీయ జనతా పార్టీలో ఆమె ఎలా చేరుతారని డిగ్గీ ప్రశ్నించారు.
దీనికి ఆమె వివరణ ఇవ్వాల్సిన అవసరముందన్నారు. కాంగ్రెసు పార్టీలో ఆమెకు సముచిత స్థానం ఇచ్చామని చెప్పారు. పురంధేశ్వరిని విజయవాడ నుండి పోటీ చేయాలని సూచించామని, విశాఖ టిక్కెట్ కోసమే ఆమె పార్టీ మారారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications