బ్రహ్మంగారి మఠంలో భగ్గుమన్న విభేదాలు
ఫిట్ పర్సన్ శంకర బాలాజీకి ధ్వజస్తంభం ప్రతిష్టాపన చేసే హక్కు లేదని మారుతి వాదిస్తున్నారు.
కడప జిల్లా శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ఆలయంలో మళ్లీ వివాదం మొదలైంది. తాజాగా ఇక్కడ దేవదాయశాఖ నియమించిన ఫిట్ పర్సన్ అధికారి మఠం నిబంధనలకు విరుద్ధంగా పాత ధ్వజస్తంభాన్ని తీసేసి కొత్తదాన్ని ఏర్పాటు చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. ధ్వజస్తంభ ప్రతిష్టాపన కోసం మూడు రోజుల నుంచి ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దివంగత పీఠాధిపతి భార్య మారుతి మహాలక్ష్మితోపాటు స్థానికులు కూడా ఈ పనులను అడ్డుకున్నారు. ఫిట్ పర్సన్ శంకర బాలాజీకి ధ్వజస్తంభం ప్రతిష్టాపన చేసే హక్కు లేదని మారుతి వాదిస్తున్నారు.
ధ్వజస్తంభం శిథిలావస్థలో ఉండటంతో కొత్తది ఏర్పాటు చేసేందుకు దేవాదాయశాఖ కమిషనర్ అనుమతులిచ్చినట్లు ఫిట్ పర్సన్ శంకర బాలాజీ చెబుతున్నారు. ఈ విషయంపై మారుతి మహాలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మఠానికి సంబంధించిన బిల్లు, వేతనాలు చెల్లించే అధికారం మాత్రమే తనకుందని చెప్పారు. జనవరి 23వ తేదీ అర్థరాత్రి ధ్వజస్తంభాన్ని తొలగించారు. రాత్రి సమయంలో తీయకూడదని తెలిసినా శంకర బాలాజీ కావాలనే తొలగించినట్లు బ్రహ్మంగారి మఠానికి చెందిన శిష్యులు తెలిపారు.

బ్రహ్మంగారి మఠం గురుపత్నికి కూడా కనీసం సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. వందల సంవత్సరాల క్రితం ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించే సమయంలో వజ్ర వైఢూర్యాలు, బంగారం, వెండి తదితరాలు వేయడం ఆచారమని, వాటికోసం ఫిట్ పర్సన్ అర్థరాత్రి పూట తొలగించారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దివంగత మఠాధిపతి కొడుకులు, రెవెన్యూ అధికారులకు కూడా సమాచారం ఇవ్వలేదు. పీఠాధిపతి రెండో ధర్మపత్ని మారుతీ మహాలక్ష్మమ్మ కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని, అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటామని శంకర బాలాజీ హెచ్చరిస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం పీఠాధిపతి జీవించి ఉన్న సమయంలోనే తంబళ్ళపల్లె గ్రామస్తులు కొత్త ధ్వజస్తంభం ఇచ్చరాని శంకర బాలాజీ వివరిస్తున్నారు.












Click it and Unblock the Notifications