రాయపాటితో పాటు టిడిపిలోకి డొక్కా, జైరాం ఫోన్?

తాను బేషరతుగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 26 లేదా 30వ తేదీన చంద్రబాబునాయుడు సమక్షంలో చేరనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ సీమాంధ్ర ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ పార్టీని వీడటం అసాధ్యమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి జైరాం రమేష్ ధీమా వ్యక్తం చేశారు. డొక్కా కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారంటూ కొందరు మీడియా ప్రతినిధులు శుక్రవారం ఆయన వద్ద ప్రస్తావించగా అటువంటి వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు.డొక్కా కాంగ్రెస్‌ను వీడటం ఊహకందని విషయమన్నారు.
తనతోపాటు డొక్కా కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతారని రాయపాటి ప్రకటించిన విషయాన్ని మీడియా ప్రతినిధులు ఆయన దృష్టికి తేగా, అలాంటి అవకాశం లేదని అన్నారు. వెంటనే డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. టిడిపిలో చేరుతావన్న వార్తలు వస్తున్నాయని, ఏమిటి ఇది?' అని ఫోన్‌లో ప్రశ్నించారు. అవన్నీ తనకు సంబంధం లేకుండానే బయటకొచ్చాయని డొక్కా సమాధానమిచ్చారు. ఇలాంటి ఊహాజనిత వార్తలను తక్షణం ఖండించాలని జైరాం సూచించారు.
అయితే, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌తో రాయపాటి అంతకు ముందు సమావేశమయ్యారు. టిడిపిలో చేరికపై డొక్కాతో రాయపాటి చర్చలు జరిపినట్లు సమాచారం. రాయపాటితో సంప్రదింపులు జరుగుతున్నాయని, టిడిపిలో చేరికపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని డొక్కా తెలియజేశారు.












Click it and Unblock the Notifications