ఏపీకిచ్చి టీని చేర్చలేదే: అక్బర్, మనదే ఆలస్యం:లక్ష్మణ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే రైతు ఆత్మహత్యలు ఉండకపోయేవని భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్ సోమవారం శాసన సభలో అన్నారు. విద్యుత్ ఇబ్బందులకు గత ప్రభుత్వాలను విమర్శిస్తున్న వారు.. తాము అందులో భాగస్వాములం అనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.
కేంద్రంతో ఘర్షణ వైఖరి సరికాదన్నారు. కేంద్రం కూడా అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తోందని చెప్పారు. బంగారు తెలంగాణలో తప్పటడుగులు వద్దని చెప్పారు. విద్యుత్ రంగ సంక్షోభాన్ని రాజకీయంతో ముడిపెట్టవద్దని హితవు పలికారు. విద్యుత్ వాటా, కేంద్రం నుండి సాయం అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చాక 350 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ముప్పై శాతం విద్యుత్ కొరత ఉందని చెప్పారు. అయితే, కేంద్రం తమ పైన వివక్ష చూపుతుందని చెప్పడం సరికాదన్నారు. దీని పైన తెరాస నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీనిపై డాక్టర్ కే లక్ష్మణ్ స్పందిస్తూ.. రాజకీయ విమర్శలు చేయడానికి తమకు సమయం ఇస్తే చాలా ఉందని, తాము రాజకీయ విమర్శలు చేయదల్చుకోలేదని చెప్పారు. అయితే, సభ్యులు కేంద్రం సహకరించడం లేదని ప్రారంభించారన్నారు. దానికి కేసీఆర్ స్పందిస్తూ.. తాను వివక్ష చూపిస్తుందనలేదని, స్పందించాల్సిన సమయంలో స్పందించలేదన్నానని తెలిపారు.
బాబును తప్పిపట్టిన అక్బర్
తెలంగాణలో విద్యుత్ సమస్యకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కారణమని మజ్లిస్ పార్టీ శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. జీవో నెంబర్ 20 ప్రకారం మనకు రావాల్సిన విద్యుత్ రావడం లేదన్నారు.
విద్యుత్ వాటా నిర్ణయాధికారం ఏపీ తన గుప్పిట్లో పెట్టుకుందని విమర్శించారు. జూన్ 18వ తేదీ నుండే ఏపీ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతోందన్నారు. గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు విద్యుత్ అంశంపై దృష్టి సారించలేదన్నారు. ఏపీ తీరు వల్లే విద్యుత్ సమస్యలు అన్నారు. చట్టబద్దంగా రావాల్సిన విద్యుత్ అడ్డుకుంటోందన్నారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు విద్యుత్ విషయంలో మీ నేత చంద్రబాబును కన్విన్స్ చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా పథకంలో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లను చేర్చిందని, తెలంగాణను ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. మూడేళ్లలో ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్ పూర్తవ్వాలన్నారు.
ఉద్యమం చేసి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకు వచ్చారని, అలాగే ప్రభుత్వాన్ని కూడా విజయపథంలో నడుపుతారని భావిస్తున్నానని తెలిపారు.
24 గంటల విద్యుత్ పైన లక్ష్మణ్ వివరణ
24 గంటల విద్యుత్ కోసం పథకంలో రాజస్థాన్, ఏపీ రాష్ట్రాలను కేంద్రం చేర్చిందని, తెలంగాణను ఎందుకు చేర్చలేదని అక్బరుద్దీన్ అన్నారని డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. అయితే, 24 గంటల విద్యుత్ కోసం కేంద్రం అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసిందన్నారు. కానీ, మన ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందని చెప్పారు.












Click it and Unblock the Notifications