అన్న ప్రసాదాల విరాళాలపై టీటీడీ తాజా ప్రకటన
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం నాడు 69,746 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 23,649 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.27 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 13 కంపార్ట్‌మెంటల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

కాగా అన్నప్రసాద విరాళాలపై టీటీడీ అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు అన్నప్రసాద ట్రస్టుకు 9.70 లక్షల మంది భక్తులు విరాళాలు ఇచ్చినట్లు పేర్కొంది టీటీడీ పాలక మండలి. శ్రీవారి అన్న ప్రసాదాల కోసం ప్రపంచవ్యాప్తంగా భక్తులు అందజేసిన విరాళాల మొత్తం 2,200 కోట్ల రూపాయలకు చేరుకున్నట్లు వివరించింది.
అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళాలను ఇవ్వడాన్ని టీటీడీ సులభతరం చేసిన విషయం తెలిసిందే. వీటికోసం ప్రత్యేకంగా కియోస్క్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయం, దేవుని కడప వంటి చోట్ల ఇవి అందుబాటులో ఉంటోన్నాయి.
ఇవి ఏర్పాటైన తరువాత విరాళాల సంఖ్య భారీగా పెరిగినట్టయింది. విరాళాలను ఇవ్వడానికి వివిధ బ్యాంకులు ఈ కియోస్క్‌లను టీటీడీకి విరాళంగా అందజేశాయి. ఈ మిషన్ల ద్వారా భక్తులు ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు సులభతరంగా విరాళం అందిచవచ్చు.
ఒక రూపాయి నుండి 99,999 రూపాయల వరకు మకు తోచిన మొత్తాన్ని భక్తులు కియోస్క్ మిషన్‌లోని క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి యూపీఐ ద్వారా విరాళం ఇవ్వవచ్చు. టీటీడీని పూర్తిగా డిజటలైజేషన్ చేయడంలో భాగంగా ఈ మిషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది టీటీడీ. భవిష్యత్తులో మరిన్ని కియోస్క్ మిషన్లను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటోంది.
అలాగే- తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకం కొనసాగుతోంది. ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణకు 44 లక్షల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.
ఇందులో ఉదయం అల్పాహారం కోసం 10 లక్షల రూపాయలు, మధ్యాహ్న భోజనం కోసం 17 లక్షల రూపాయలు, రాత్రి భోజనం కోసం 17 లక్షల రూపాయలు ఖర్చవుతాయని టీటీడీ వివరించింది. ఈ మొత్తాన్ని చెల్లించిన దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు.












Click it and Unblock the Notifications