ఏపీ సచివాలయంలో 11కు చేరిన కరోనా కేసులు- 11న కేబినెట్ భేటీ వేదిక మారుతుందా ?
ఏపీ సచివాలయంలో నానాటికీ పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఈ నెల 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం దీని అజెండా ఆమోదంతో పాటు పలు కీలక అంశాలపై కేబినెట్ లో చర్చించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 11న ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మంతత్రివర్గ సమావేశ మందిరంలో కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు.
అయితే తాజాగా ఏపీ సచివాలయంలో ఒకట్రెండు కరోనా కేసులు బయటపడటంతో ఉద్యోగులందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో మరిన్ని కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ సంఖ్య 11కు చేరుకుంది. ఇవాళ, రేపు కూడా పరీక్షలు కొనసాగే అవకాశం ఉండటంతో మరిన్ని కేసులు బయటపడటం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే మరో మూడు రోజుల్లో జరగాల్సిన కేబినెట్ భేటీ వేదికపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్ధితి ఎదురవుతుంది. ఎందుకంటే కేబినెట్ భేటీ జరిగే సీఎంవోలోలోనే సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగి ఒకరు కరోనాతో ఆస్పత్రి పాలయ్యారు. ఇతని నుంచి మరెవరికైనా సోకిందా లేదా అన్న క్లారిటీ లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనే కేబినెట్ భేటీకి తగు జాగ్రత్తలు తీసుకోక తప్పదు.

తాజాగా బయటపడుతున్న కేసులతో ఇప్పటికే వ్యవసాయ, పరిశ్రమల శాఖతో పాటు మరికొన్ని శాఖల్లో ఉద్యోగులను ఇంటికే పరిమితం చేస్తున్నారు. వీరికి వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఇచ్చేశారు. ప్రస్తుత పరిస్ధితుల్లో సచివాలయానికి వచ్చేందుకు కీలక శాఖల ఉద్యోగులు ఇష్టపడటం లేదు. దీంతో ఈ ప్రభావం సహజంగానే కేబినెట్ భేటీపై పడే అవకాశముంది. కాబట్టి ప్రభుత్వం చివరి నిమిషంలో కేబినెట్ వేదిక మారుస్తుందా లేదా అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications