రాజధాని గ్రామాల్లో డ్రోన్ కెమెరాలు .. మందడం, కృష్ణాయ పాలెంలో ఉద్రిక్తత
రాజధాని అమరావతి గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి . రాజధాని అమరావతి కోసం అమరావతి రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు ఒప్పుకోబోమని ఇప్పటికే రైతులు తేల్చి చెప్పారు . ఇక తమ ప్రాణాలు అయినా ఇస్తాం కాని రాజధాని అమరావతి తరలింపు ఒప్పుకోమని రైతులు నేటికీ దీక్షలను కొనసాగిస్తున్నారు. ఇక ఈ క్రమంలో తాజా పరిణామాలు రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తతలకు కారణం అవుతున్నాయి.

కృష్ణాయపాలెంలో 426 మంది రైతులపై పోలీసులు కేసులు
కృష్ణాయపాలెంలో తహసీల్దార్ మల్లీశ్వరిని అడ్డుకున్నారంటూ ఏకంగా 426 మంది రైతులపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో రాజధాని గ్రామాల్లో దుమారం రేపింది. ఇందుకు నిరసనగా రాజధానిలోని గ్రామాల్లో రైతులు రోడ్లపైకొచ్చారు. కృష్ణాయపాలెంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. ఇక రైతులపై కేసులు పెట్టటాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని గ్రామమైన మందడం లో సైతం రోడ్ల పైకి వచ్చి ఆందోళనల బాట పట్టారు రైతులు .

మందడంలో కొనసాగుతున్న ఉద్రిక్తత
ఈ క్రమంలో మందడంలో పోలీసులు డ్రోన్ కెమెరాలతో ఆ పరిసర ప్రాంతాలను చిత్రీకరిస్తున్న సమయంలో రైతులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. మహిళలు స్నానాలు చేస్తుంటే కెమేరాలతో చిత్రీకరిస్తున్నారని మీరు పోలీసులా గూండాలా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రోన్ కెమెరాలతో ఎందుకు చిత్రీకరిస్తున్నారని మహిళా రైతులు మండిపడ్డారు . తాము చేసిన నేరం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

డ్రోన్ కెమెరా లాక్కున్న రాజధాని రైతులు , ఉద్రిక్తత
తామేమి ఆర్ధిక నేరగాళ్లం కాదని, అరాచకం సృష్టించే వాళ్ళం కాదని ఎందుకు డ్రోన్ లతో చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసు డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తుండగా గ్రామస్తులు కానిస్టేబుల్‌ను అడ్డుకుని డ్రోన్ కెమెరా లాక్కున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, రైతుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు జేఏసీ నేత సుధాకర్‌పై చేయి చేసుకున్నారు. దీంతో మందడంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. దీంతో అమరావతి గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది.

కర్రలతో పోలీసులపైకి తిరగబడిన రైతులు .. భయం గుప్పిట్లో రాజధాని గ్రామాలు
ఎస్సై, కానిస్టేబుల్స్ లను అడ్డుకున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా మరికొంతమంది రైతులు పోలీసులను అడ్డుకున్నారు. దాంతో మరింతగా రెచ్చిపోయిన పోలీసులు రైతులను తీవ్రమైనఅసభ్య పదజాలంతో దూషించారు. దీంతో రైతులు కర్రలతో పోలీసులపైకి తిరగబడ్డారు. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం మరింత పెరిగింది . ఇక రాజధాని గ్రామాల్లో సర్వేలు , డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణల నేపధ్యంలో అక్కడ ప్రజల్లో భయాందోళన మరింత పెరిగింది.












Click it and Unblock the Notifications