ఇంద్రకీలాద్రిపై దసరా సందడి-అన్నపూర్ణ, మహాలక్ష్మిగా దుర్గమ్మ-రేపు జగన్ రాక
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా ఇవాళ ఐదోరోజు రెండు అలంకారాల్లో కనకదుర్గమ్మ దర్శనమిస్తోంది. ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ దర్శనమిస్తుండగా.. మధ్యాహ్నం 12 తర్వాత శ్రీ మహాలక్షి దేవి అవతారంలో దర్శనమివ్వబోతోంది.
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా భారీ ఎత్తున భక్తుల తరలివచ్చి దుర్గమ్మ దర్శనం చేసుకుంటున్నారు. వీరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా దర్శనం చేసుకుంటున్నారు. రేపు మూలా నక్షత్రం రోజు ఈ సంఖ్య రెట్టింపు కానుందని భావిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాల్లో భాగాంగా మూలానక్షత్రం రోజున ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. దీంతో సీఎం రాక సందర్భంగా దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ఇవాళ అధికారులతో కలసి ఏర్పాట్లు పరిశీలించారు. ఏర్పాట్లు పక్కాగా ఉండాలని దేవదాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

రేపు సీఎం జగన్ తో పాటు వచ్చే మంత్రులు, ఉన్నతాధికారులకు దేవదాయ శాఖ తరఫున అధికారిక స్వాగతం పలికి చినరాజగోపురం నుంచి సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాల సమర్పణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే అంతరాలయంలో పూజల అనంతరం వేదపండితుల ఆశీర్వచనం కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి వెల్లంపల్లి ఆదేశాలు ఇచ్చారు.
ముఖ్యమంత్రికి పూర్ణకుంభ స్వాగత ఏర్పాట్లు చేయాలని ఈవోను మంత్రి ఆదేశించారు. రేపు సీఎం జగన్ రాక సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మూలానక్షత్రం సందర్భంగా భక్తులు కూడా భారీ ఎత్తున తరలి రానున్న నేపథ్యంలో.. క్యూలైన్ల ద్వారా దర్శనాన్ని మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. మరోవైపు భక్తుల కోరికపై ఓం టర్నింగ్ పాయింట్ వద్ద కూడా అధికారులు ఒక టికెట్ కౌంటర్ ఏర్పాటు చేశారు.
కరోనా నేపథ్యంలో ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. గతానుభవాల్ని దృష్టిలో ఉంచుకని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు, దేవస్ధానం పాలమండలి చెబుతోంది. కరోనా డబుల్ డోస్ తీసుకున్న వారికి మాత్రమే దర్శనాలకు అనుమతిస్తున్నారు.












Click it and Unblock the Notifications