రైతులు, స్త్రీల కళ్లలో ఆనందం చూడాలనే: బాబు
హైదరాబాద్: రైతులు, మహిళల కళ్లల్లో ఆనందం చూడటం కోసమే రుణమాఫీ చేశానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రుణమాఫీ చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రకాశం జిల్లా నుంచి శనివారంనాడు భారీ సంఖ్యలో డ్వాక్రా మహిళలు తరలివచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని బాబు ప్రకటించారు.
అక్టోబర్ నుంచి గ్రామాలకు 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు వ్యవసాయ ఖర్చులు తగ్గించడానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇచ్చిన హామీ ప్రకారం రుణమాపీ చేసినందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.

రాజధాని కమిటీ సమావేశం
సచివాలయంలో ఏపీ రాజధాని కమిటీ సమావేశం ముగిసింది. మంత్రి నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తొమ్మిది కమిటీ సభ్యులు, అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థలు మెకంజీ, ఎల్అండటీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అభివృద్ధి చెందిన నగరాలతో పాటు సింగపూర్, మలేషియా రాజధానులను పరిశీలించాలని కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రాజధానిని ప్రపంచ స్థాయిలో నిర్మించడంపై కమిటీ దృష్టి సారించింది. దాదాపు 20 నుంచి 30 వేల ఎకరాల్లో రాజధానిని నిర్మించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చిన మూడు నెలలలోపు భూసేకరణ పూర్తి చేయాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈరోజు 11:30 గంటలకు చంద్రబాబుతో శివరామకృష్ణన్ కమిటీ సమావేశమైంది.












Click it and Unblock the Notifications