ఏపీలో ఇద్దరు డిప్యూటీ సీఎంలకు షాక్ - శాఖల్లో కోత : బుగ్గనకు కేటాయింపు- ఎందుకిలా..!!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇద్దరు మంత్రుల శాఖలను పునర్వ్యవస్థీకరించింది. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి శాఖల్లో కోత విధించారు. వాణిజ్య పన్నుల శాఖను నారాయణ స్వామి నుంచి తప్పించిన ప్రభుత్వం..ఆ శాఖను ఆర్థిక మంత్రి బుగ్గనకు అప్పగించారు. ఇక నుంచి నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖకే పరిమితం కానున్నారు. ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ గెజిట్‌ను విడుదల చేశారు.

ఆర్దిక శాఖలో వాణిజ్య పన్నుల విలీనం
వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలను ఆర్ధిక శాఖ పరిధిలోకి తీసుకెళ్లాలని గతంలో ప్రభుత్వం భావించింది. అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చ లేదు. అప్పటి ప్రతిపాదలను ఇప్పుడు అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే మరో డెప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖను తప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రులను మార్చి పూర్తిగా కొత్త వారితో కేబినెట్ ఏర్పాటు చేస్తారని భావిస్తున్న సమయం లో ఈ నిర్ణయాలు కీలకంగా మారాయి.

ధర్మాన శాఖలు మార్పుకు అవకాశం
దీని ఆధారంగానే మార్చిన శాఖలతోనే కొత్త మంత్రులకు పోర్టుఫోలియోలు కేటాయించనున్నారు. అయితే, ఆదాయ పరంగా కీలక శాఖలను ఆర్దిక శాఖ పరిధిలోకి తీసుకు రావాలనే ప్రభుత్వ ఆలోచన. అందులో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అయితే, పాలనా పరంగా ఆర్దిక శాఖ..ఆ శాఖ పర్యవేక్షించే మంత్రి పైన పని భారం - ఒత్తిడి ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఆర్దిక శాఖ మంత్రి వద్ద అదనంగా శాసనసభా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే, విస్తరణలో భాగంగా శాసనసభా వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యత ఆర్దిక శాఖ మంత్రికి కాకుండా.. న్యాయ శాఖ తో పాటుగా కలిపి కేటాయిస్తారనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది.

ప్రక్షాళన లో భాగంగానే ఈ నిర్ణయాలంటూ
డిసెంబర్ 8 నాటికి ప్రస్తుత మంత్రులు బాధ్యతలు స్వీకరించి రెండున్నారేళ్లు పూర్తవుతుంది. దీంతో.. డిసెంబర్ నెలాఖరులోగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు ప్రారంభమైనట్లుగా చెబుతున్నారు. అయితే, నవరత్నాలు..స్కిల్ డెవలప్ మెంట్ శాఖలను ప్రత్యేక పోర్టు ఫోలియోలుగా కేటాయించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
మంత్రివర్గ విస్తరణకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగానే ఈ శాఖల విలీనం..కొత్త శాఖలు తెర మీదకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో..కొత్త కేబినెట్ .. కొత్త మంత్రులతో త్వరలోనే కూర్పు పూర్తి చేసేందుకు వీలుగా సీఎం అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. మరి..ముఖ్యమంత్రి కేబినెట్ ప్రక్షాళన గురించి ఎప్పుడు ప్రకటన చేస్తారనే ఉత్కంఠ ఇటు ప్రస్తుత మంత్రుల్లో..అదే విధంగా ఆశావాహుల్లో పెరిగిపోతోంది.












Click it and Unblock the Notifications