పెద్దిరెడ్డి 'లెక్క'లు తేల్చుతున్న పవన్, కీలక నిర్ణయం- ఉక్కిరి బిక్కిరి..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కొద్ది కాలం గా వైసీపీ ముఖ్య నేత పెద్దిరెడ్డి పైన గురి పెట్టారు. అటవీ భూములను పెద్దిరెడ్డి ఆక్రమించారనే ఆరోపణల పైన ఫోకస్ చేసారు. ఇందులో నిజాలు తేల్చాలని డిసైడ్ అయ్యారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెద్దిరెడ్డి పైన వచ్చిన ఆరోపణలను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలన చేస్తోంది. ఈ సమయంలో పవన్ నిర్ణయం రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.
డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి మంగళంపేట అడవి మధ్యలో ఉన్న భూమి వారసత్వంగా ఎలా వచ్చిందో తెలుసుకోవాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ భూమి ఎప్పుడు చేతులు మారింది? దీనిలో ఎవరి పాత్ర ఎంత అనే దానిపై నివేదికలు తయారు చేయాలని సూచించారు. పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల చేతిలో ఉన్న అటవీ భూములపై పవన్ సమీక్ష నిర్వహించారు. అటవీ భూములను ఆక్రమించిన వారు, చట్టాన్ని ఉల్లంఘించి అతిక్రమణలకు పాల్పడిన వారు కచ్ఛితంగా శిక్షార్హులవుతారని పేర్కొన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల అఫిడవిట్‌లో అటవీ భూముల గురించి తప్పుడు సమాచారం అందించారనే అంశం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని న్యాయ నిపుణుల సలహా ప్రకారం ముందుకెళ్లాలని ఆదేశించారు.

ఇదే సమయంలో అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు శాఖ వెబ్‌సైట్‌లో వెల్లడించాలని, ఈ దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎవరి ఆక్రమణలో ఎంత అటవీ ఆస్తి ఉంది? వారిపై నమోదైన కేసుల వివరాలు, ప్రస్తుతం సదరు కేసులు ఏ స్థితిలో ఉన్నాయో ప్రజలకు తెలియాలన్నారు. అటవీ చట్టం ప్రకారం ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్ (పీవోఆర్), చార్జిషీటు దాఖలు చేశామని అధికారులు ఆయనకు చెప్పారు. ఆక్రమణలను తొలగించి స్వాధీనం చేసుకున్నామని, కోర్టులో కేసుల వివరాలు దాఖలు చేశామన్నారు. అటవీ భూముల పరిరక్షణకు ఉద్దేశించిన చట్టం కఠినంగా ఉందని.. అటవీ ఆస్తులను కబ్జా చేస్తే....కఠిన చర్యలకు ఉపక్రమించాలని పవన్ ఆదేశించారు. మంగళంపేట అటవీ భూముల వ్యవహారం చూస్తే.. చట్టం కఠినంగా ఉన్నా.. అమలు లేకపోవడం వల్లే ఆక్రమణలు జరిగినట్టు కనిపిస్తోందని పవన్ అభిప్రాయపడ్డారు. పవన్ ఆదేశాలతో అధికారులు లెక్కలు తేల్చే పని ప్రారంభించారు. నివేదిక వచ్చిన తరువాత పవన్ తీసుకునే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications