చిత్తూరు జిల్లాలో భూ ప్రకంపనలు: రామకుప్పంలో పరుగులు తీసిన జనం, వీధుల్లోనే..
చిత్తూరు: జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం సృష్టిస్తున్నాయి. రామకుప్పం మండలంలో శుక్రవారం రాత్రి వరకు కూడా భూ ప్రకంపనలు కొనసాగాయి. రామకుప్పం మండలం పరిధిలోని ఎస్. గొల్లపల్లి, గురివి మాకులపల్లి, కృష్ణా నగర్ కాలని, ఎద్దుల గట్టు గ్రామాల్లో భూమి కంపించింది. భూమి పొరల నుంచి భారీ శబ్ధాలు వస్తున్నాయి.
ఆయా గ్రామాల్లో భూమి పలుమార్లు వరుసగా కంపించింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన జనాలు.. ఇళ్లు వదిలి వీధుల్లోకి, పొలాల్లోకి పరుగుల పెట్టారు. మరోవైపు, ఏనుగుల బెడద కూడా అక్కడి ప్రజలను వేధిస్తోంది. ఇదే గ్రామాల పొలాల్లో వారం రోజులుగా ఏనుగులు సంచరిస్తున్నాయి. ఈ కారణంతో ప్రజలు పొలాల్లోకి వెళ్లొద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

భూ ప్రకంపనలతో ఇళ్లల్లో ఉండలేక, ఏనుగుల సంచారంతో పొలాల్లోకి వెళ్లకుండా ప్రజలు రోడ్లపైనే ఉంటున్నారు. మరోవైపు విద్యుత్ సరఫరాలో అంతరాయంతో బాధిత గ్రామాలు చీకట్లోనే ఉంటున్నాయి. ఈ క్రమంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
కాగా, గురువారం రాత్రి కూడా రామకుప్పం మండలంలోని పలు గ్రామాల్లో భూప్రకంపనలు సంభవించాయి. గడ్డూరు, పెద్దగరిగేపల్లి, యానాదికాలనీ, పంద్యాల మడుగు గ్రామాల్లో భూమి కంపించింది. గురువారం రాత్రి నుంచి భూమి పొరల్లో శబ్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజురోజుకు శబ్దాలు పెరుగుతుండటంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఆగని వానలు.. ఆందోళనలో ప్రజలు, రైతులు
ఇది ఇలావుండగా, చిత్తూరు, నెల్లూరు జిల్లాలను భారీ వర్ణాలు వీడటం లేదు. తాజాగా,
చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల ఏకంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నట్టు తెలిపింది. నంబర్ 29న అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, దీని ప్రభావంతో దక్షిణా కోస్తాంధ్రలో భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
Recommended Video
కాగా, నెల్లూరు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కలువాయి మండల కేంద్రంలోని చెరువు వద్ద నీటిప్రవాహం ఎక్కువ కావడంతో సోమశిల దక్షిణ కాలువ హెడ్ రెగ్యూలేటర్ గేటు కొట్టుకుపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కాలువకు గండి కొట్టి నది వైపు నీటిని మళ్లించారు. భారీ వర్షాలతో తీరని నష్టం జరిగిందని తమను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications