ఏపీలో పలు గ్రామాలను కుదిపేసిన భూ ప్రకంపనలు
Earthquake: భూకంపం ఏపీని కుదిపేసింది. ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. ఇళ్ల నుంచి బయటికి పరుగులు పెట్టేలా చేసింది. చాలాసేపటి వరకు రోడ్ల మీదే గడిపారు. ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. ప్రత్యేకించి- ప్రకాశం జిల్లాలోని పలు గ్రామాల్లో కొద్దిసేపటి కిందటే భూ ప్రకంపనలు రికార్డయ్యాయి.
దాదాపు రెండు వారాల వ్యవధిలో ఏపీలో భూమి కంపించడం ఇది రెండోసారి. ఈ నెల 4వ తేదీన ఏపీ, తెలంగాణల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. తెలంగాణలోని ములుగు జిల్లాలో రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది అప్పట్లో. అదే సమయంలో ఏపీ, తెలంగాణల్లో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

ఏపీలో కృష్ణా జిల్లాలో భూమి కంపించింది. విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెంలల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. ఇక్కడ దీని తీవ్రత రెండు సెకెన్ల పాటు కొనసాగింది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి సహా వేర్వేరు జిల్లాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో దీని తీవ్రత 3 నుంచి 4 సెకెన్ల పాటు కనిపించింది.
ఇప్పుడు తాజాగా ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల పరిదిలోని పలు గ్రామాల్లో ఈ ప్రకంపనలు కంపించాయి. దీనితో జనం భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్లు, దుకాణాల నుంచి బయటికి పరుగులు పెట్టారు. సురక్షిత ప్రదేశాలకు చేరుకున్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు.
దీని తీవ్రత స్వల్పంగా ఉండొచ్చని సెస్మాలజీ నిపుణులు అంచనా వేస్తోన్నారు. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం కూడా సెస్మిక్ జోన్ 3 పరిధిలో వస్తుంది. ఓ మోస్తరు భూకంపం ఇక్కడ సంభవించే అవకాశాలు లేకపోలేదీ రీజియన్‌లో. అమరావతి ప్రాంత పరిధిలో గరిష్ఠ స్థాయిలో రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో భూకంపం సంభవించే ప్రమాదం లేకపోలేదని ఎన్జీఆర్ఐ చెబుతోంది.












Click it and Unblock the Notifications