రంజాన్ మాసం తొలినాడే ఆకాశంలో అద్భుతం; చంద్రుడితో శుక్ర గ్రహణం!!
రంజాన్ మాసం ప్రారంభమైంది. మహమ్మదీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే రంజాన్ మాసం ప్రారంభం రోజే ఆకాశంలో అద్భుతం జరిగింది. సౌర కుటుంబంలో అత్యంత ప్రకాశవంతంగా గుర్తించబడిన గ్రహాలైన శుక్రుడు, బృహస్పతి చంద్రుడికి దగ్గరగా కనిపించారు. అంతే కాదు చంద్రుడితో శుక్ర గ్రహణం, శుక్రుడితో చంద్ర సంయోగం జరగడం ఒక అద్భుతంగా ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. శుక్రవారం సాయంత్రం ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో ఈ అద్భుతం జరిగిందని వారు అంటున్నారు. కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఈ అద్భుత దృశ్యాలను వారి మొబైల్ ఫోన్లలో బంధించారు.
ఇక మన దేశంలో సూర్యాస్తమయానికి ముందే ఈ అద్భుతం జరగడంతో మనం చూడలేకపోయామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ శుక్ర గ్రహణం సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు మొదలై, 5.30 గంటలకు ముగిసిందని అంటున్నారు. ఆకాశంలో శుక్రవారం జరిగిన రెండు అరుదైన సంఘటనలను ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్. శ్రీరఘునందన్ ధ్రువీకరించారు. లద్ధాక్ లోని అన్ లే అబ్జర్వేటరీలో శాస్త్రవేత్తలు దీనిని పరిశీలించారు.

ఇక మన రాష్ట్రంలో చాలా చోట్ల రాత్రివేళ ఆకాశంలో చూసినప్పుడు చంద్రుడి కింద ఒక చుక్క కనిపించిందని, అయితే ఆ చుక్క నక్షత్రం కాదు శుక్ర గ్రహం అని చెబుతున్నారు. శుక్రుడు, చంద్రుడికి కుడివైపున కనిపించడంతో పాటు, నిదానంగా చంద్రుని చీకటి అంచు వెనక్కి శుక్రుడు జారుకున్నాడు. దీంతో శుక్ర గ్రహణం ఏర్పడింది. శుక్రుడు నిన్న సాయంత్రం ప్రకాశవంతంగా చంద్రుడికి దగ్గరగా రావడంతో చంద్రుడి ప్రకాశం 250 రెట్లు పెరిగింది.
ఇక ఇదే కాదు మార్చి చివరలో ఆకాశంలో ఐదు గ్రహాలు కనువిందు చేయనున్నాయని మార్చి 28వ తేదీన రాత్రి ఐదు గ్రహాలు బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, యురేనస్ ఒకే వరుసలో కనిపించనున్నాయని చెబుతున్నారు. ఈ దృశ్యాన్ని లార్జ్ ప్లానెటరీ అలైన్మెంట్ అని పిలుస్తారని, భూమి నుంచి వీటిని చూస్తున్నప్పుడు ఇవి ఆర్చి ఆకారంలో కనిపిస్తాయని అంటున్నారు. ఈ అద్భుత దృశ్యం గతేడాది జూన్లో కూడా చోటుచేసుకుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు కూడా మళ్లీ శుక్రుడికి దగ్గరగా రావడాన్ని చూడవచ్చునని ఖగోళ శాస్త్ర పరిశోధకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications