ఇల వైకుంఠం తిరుమలలో ఇలాంటివి కలలోనైనా ఊహించగలమా?
Egg Biryani in Tirumala: కలియుగ వైకుంఠంలా అలరారుతున్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో ఎగ్ బిర్యానీ ప్రత్యక్షం కావడం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. తమిళనాడుకు చెందిన భక్తులు తిరుమలలోని రామ్ బగీచ బస్టాండ్ సమీపంలో ఎగ్ బిర్యానీ భోజనం చేస్తోండటాన్ని భక్తులు గుర్తించారు. తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
తిరుమలలో ఎగ్ బిర్యానీ..
తమిళనాడులోని తిరువళ్లూరు ప్రాంతానికి చెందిన భక్తులు 30 మంది శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్నారు. తిరుపతిలో ఎగ్ బిర్యానీని తీసుకొని తమ వాహనంలో తిరుమల కొండకు చేరుకున్నారు. రామ్ బగీచ బస్టాండు సమీపంలో భోజనం చేస్తున్న సమయంలో భక్తులు గుర్తించి విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

భూమన కరుణాకర్ రెడ్డి ఘాటుగా..
ఈ ఘటన పట్ల టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తిరుమల పవిత్రతను కాపాడటంతో టీటీడీ పాలక మండలి పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. తిరుమలకు నిషేధిత తినుబండారాలతో భక్తులు వస్తున్నా టీటీడీ విజిలెన్స్ వ్యవస్థ దాన్ని గుర్తించలేకపోతుందా? నిద్ర పోతుందా? అంటూ ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం..ఇప్పుడేం చేస్తుంది..
తిరుమల విషయంలో తమ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..ఇప్పుడేం చేస్తుందని నిలదీశారు.
టీటీడీ వైఫల్యం మరోసారి బట్టబయలు..
చంద్రబాబు- పవన్ కల్యాణ్ పాలనలో మద్యం, మాసం తిరుమలలో పట్టుబడుతున్నాయని ధ్వజమెత్తారు. శ్రీవారి ఆలయానికి సమీపంలో ఎగ్ బిర్యాని పట్టుబడిందంటే టీటీడీ వైఫల్యం మరోసారి బట్టబయలైనట్టు కాదా భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుమల కొండపైకి మారణాయుధాలతో వచ్చినా పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తిరుమల లడ్డూపై ఎన్నో అబద్ధపు ప్రచారాలు..
వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఎల్లో మీడియా ద్వారా తిరుమల లడ్డూపై చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం ఎన్నో అబద్ధపు ప్రచారాలు చేయించిందని, ఇప్పుడు తిరుమలలో కళ్లముందు ఎగ్ బిర్యాని దొరికినా నోరు మెదపట్లేదని ధ్వజమెత్తారు. తెలుగుదేశం- జనసేన- బీజేపీ నాయకుల సేవలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పనిచేస్తోన్నారంటూ ఆరోపించారు.
తిరుమల కొండపై ఎర్ర చందనం స్మగ్లింగ్..
భక్తులను ఏ మాత్రం పట్టించుకోవట్లేదని, దీనికి నిదర్శనమే ఈ నెల 8వ తేదీన తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన అని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. తిరుమల కొండపై ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ దుండగులు నాలుగుసార్లు పట్టు బడ్డారని, 40 సార్లు పట్టుబడకుండా తప్పించుకు తిరిగి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
పీఠాధిపతులు, హిందుత్వ సంఘాలు..
శ్రీవారి లడ్డు ప్రసాదం విషయంలో తమ ప్రభుత్వంపై ఎన్నో నింద మోపారని, నేరారోపణలు చేశారని భూమన తప్పుపట్టారు. సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి నడుం బిగించిన పీఠాధిపతులు, హిందుత్వ సంఘాలు ఇప్పుడు తిరుమలలో ఎగ్ బిర్యానీ లభించడం పట్ల చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను నిలదీయాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications