‘గడప గడపకు మన ప్రభుత్వం’ - ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు..!!
గడప గడపకు మన ప్రభుత్వం కొనసాగింపు పై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు జిల్లాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో కోడ్ అమలుకు సంబంధించి ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల నియమావళే ఎమ్మెల్సీ ఎన్నికలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటికే కోడ్ అమల్లోకి ఉన్నట్లు క్లారిటీ ఇచ్చింది. కోడ్ అమలులో ఉన్న జిల్లాల్లో ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్స్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్లను ప్రభావితం చేసే కొత్త స్కీములు, ప్రకటనలు చేయకూడదని చెప్పిన ఎన్నికల సంఘం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'గడప గడపకు మన ప్రభుత్వం' కు సంబంధించి కీలక ఆదేశాలు ఇచ్చింది.
ఏపీలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఉపాధ్యాయ- గ్రాడ్యుయేట్ - స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో.. ప్రభుత్వం అమలు చేస్తున్న గడప గడపకు ప్రభుత్వంతో పాటుగా పాదయాత్రల పైన క్లారిటీ ఇవ్వాలని తాజాగా చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎన్నికల సంఘానికి లేఖ రాసారు. దీంతో, కోడ్ కు సంబంధించి ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలను వెల్లడించింది. ముఖ్యమంత్రి, మంత్రులు ఎన్నికలు జరిగే జిల్లాలు, శాసన మండలి నియోజకవర్గాల్లో పర్యటనలు చేయవచ్చని స్పష్టం చేసింది. విద్యా సంబంధిత ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయకూడదని పేర్కొంది. కొత్త పాలసీలు, పథకాల గురించి ప్రకటనలు చేయరాదని స్పష్టం చేసింది.

ఎన్నికల జరిగే జిల్లాల్లో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులను బదిలీ చేయకూడదని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల విధుల్లో ఉన్న ఏ అధికారిని మంత్రిగానీ, ఇతర ప్రజాప్రతినిధులుగానీ పిలవకూడదని సూచించింది. తప్పనిసరి అయితే ఆయా జిల్లాల ఎన్నికల అధికారుల నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలని నిర్ధేశించింది. నిబంధనలు కాదని ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు మంత్రులను కలిస్తే వారిపై నియమావళి ప్రకారం చర్యలు ఉంటాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇక, ప్రభుత్వం అధికారికంగా కొనసాగిస్తున్న 'గడప గడపకు మన ప్రభుత్వం' పైన ఎన్నికల సంఘం నుంచి జిల్లా అధికారులు స్పష్టత కోరారు. దీనికి సంబంధించి తాజాగా ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.
'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమానికి కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అధికారుల నుంచి దీని కొనసాగింపు పైన స్పష్టత కోరుతూ లేఖలు రావటంతో.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసారు. అక్కడ నుంచి కోడ్ అమలు చేస్తూ కార్యక్రమం నిర్వహణ పైన అనుమతి వచ్చినట్లు సమాచారం. కొన్ని షరతులతో కార్యక్రమ నిర్వహణకు అనుమతి ఇచ్చింది. ఈ కార్యక్రమంలో అధికారులు సైతం పాల్గొంటుడటంతో స్పష్టత కోరినట్లు తెలుస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలోనూ వచ్చే నెల 18 నుంచి ఈ కార్యక్రమం కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఎన్నికల సంఘం నుంచి క్లారిటీ రావటంతో తిరిగి కొనసాగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications