ఏపీలో రాజకీయ పార్టీలకు ఈసీ మరిన్ని షాకులు..! ఓటరు ఇంటికెళ్లాలన్నా..!
ఏపీలో రాజకీయ పార్టీలకు ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాకిచ్చింది. ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు ప్రవర్తనా నియమావళిని నిర్దేశిస్తూ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా లేఖలు రాశారు. ఇందులో పార్టీలకు పలు షాకులిచ్చారు. ఎన్నికల వేళ కోడ్ అమలు నేపథ్యంలో తమ ఆదేశాలు తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పేశారు. ఇందులో ఎక్కడైనా తేడా వస్తే చర్యలు తప్పవన్నారు.
ఈసారి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇంటింటి ప్రచారానికి వెళ్లాలన్నా ఈసీ అనుమతి తప్పనిసరని సీఈవో ముకేష్ కుమార్ మీనా రాజకీయ పార్టీలకు రాసిన తాజా లేఖలో స్పష్టం చేశారు. స్ధానిక రిటర్నింగ్ అధికారుల అనుమతితోనే ఓటర్ల ఇళ్లకు వెళ్లాలని సూచించారు. అలాగే సభలు, సమావేశాలు పెట్టుకోవాలన్నా.. కరపత్రాలు పంచాలన్నా సువిధ యాప్ లో అనుమతి తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పేశారు.

అలాగే రాష్ట్రంలో ఇకపై జరిగే ప్రచారాలకు స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించే వారు, ముఖ్య నేతలు తమ ప్రచార వాహనాల అనుమతుల్ని సీఈవో స్దాయిలోనే తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రాజకీయ పార్టీలు తమ ప్రచార సామాగ్రికి అనుమతులు కూడా సీఈవో వద్దే తీసుకోవాలన్నారు. వివిధ జిల్లాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తుంటే స్ధానిక జిల్లా రిటర్నింగ్ అధికారుల అనుమతి తీసుకోవాల్సిందేనన్నారు. రాష్ట్రంలో సభలు, ర్యాలీలు పెట్టుకోవాలంటే 48 గంటల ముందు అనుమతి కోరాలన్నారు.
పోలింగ్ కు 48 గంటల ముందు ఎలాంటి ప్రచార అనుమతులూ ఇవ్వబోమన్నారు. అలాగే పోలింగ్ రోజు అసెంబ్లీ అభ్యర్ధితో పాటు వారి పోలింగ్ ఏజెంట్ కు కలిపి రెండు వాహనాలను మాత్రమే నియోజకవర్గంలో తిరిగేందుకు అనుమతిస్తామన్నారు. లోక్ సభ అభ్యర్ధులకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారి కార్యకర్తలకు లేదా ఏజెంట్ కు మరో వాహనం అనుమతిస్తారు. ఇందులోనూ డ్రైవర్ తో పాటు ఐదుగురి కంటే ఎక్కువ మంది ప్రయాణించరాదు.












Click it and Unblock the Notifications