విజయవాడలో అప్పుడే ఎన్నికల ప్రలోభాలు: మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై ఫిర్యాదులు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే త్వరలో జరగనున్న ఎన్నికలకు ప్రచారాన్ని మొదలుపెట్టిన అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏపీలో యుద్ధ వాతావరణం సృష్టించాయి. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ ఏపీలో జరుగుతున్న ప్రచారం ఏపీలో పొలిటికల్ హీట్ ను రోజురోజుకు పెంచుతుంది.
సహజంగా ఎన్నికల షెడ్యూల్ తర్వాత కొనసాగే హడావిడి ఏపీలో ఇప్పటినుండే కనిపిస్తుంది. ఇక అప్పుడే ఎన్నికల స్టంట్స్ కూడా ప్రారంభమయ్యాయని తాజాగా జరుగుతున్న అనేక పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవటం కోసం ఇప్పటి నుండే తాయిలాలు ఇవ్వటం కూడా మొదలైందని తెలుస్తుంది.

తాజాగా మాజీ మంత్రి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు పై టిడిపి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల కాలంలో విజయవాడ సెంట్రల్ లో వెల్లంపల్లి శ్రీనివాస్ పాదయాత్ర, పర్యటనలను నిర్వహించారు.
రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజల మద్దతు కూడగట్టడం కోసం వెల్లంపల్లి పర్యటన చేశారు. ఈ క్రమంలో ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మహిళలకు కుక్కర్లు పంపిణీ చేశారని టిడిపి నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అంతేకాదు అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎన్నికల సంఘానికి పంపి ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందే ప్రజలను వెల్లంపల్లి ప్రలోభాలకు గురి చేస్తున్నారని, మహిళలకు కుక్కర్లు పంచారని తెలుగు తమ్ముళ్లు ఆరోపించారు.
వెల్లంపల్లి ఎన్నికలలో పాల్గొనకుండా అనర్హత వేటు వేయాలని వారు ఎన్నికల అధికారులను కోరారు. అంతేకాదు వెల్లంపల్లి శ్రీనివాస్ కుక్కర్ల పంపిణీ పంచాయితీ ప్రస్తుతం పోలీస్ స్టేషన్లకు కూడా చేరింది. టిడిపి నాయకులు పోలీస్ స్టేషన్లలో సైతం వెల్లంపల్లి శ్రీనివాస్ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశారు . వెల్లంపల్లి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో విజయవాడ లో ఎన్నికల పాలిటిక్స్ ఎలా ఉన్నాయో అర్ధం అవుతుంది.












Click it and Unblock the Notifications