అనంతపురం ఏఆర్ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ రెడ్డిపై వేటు: ఎందుకంటే?
అనంతపురం ఏఆర్ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిపై వేటు పడింది. డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ ఆదేశాలు జారీ చేశారు. తాడిపత్రి అల్లర్ల సమయంలో అదనపు బలగాలు కావాలని పూర్వ ఎస్పీ అమిత్ బర్దర్ కోరగా.. తగిన బలగాలు లేవంటూ లక్ష్మీనారాయణ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి.
అదనపు బలగాలు పంపకపోవడంతో అల్లర్లు పెరిగాయని అమిత్ బర్ధర్ నివేదించారు. ఆయనపై ఎన్నికల సంఘం వేటు తర్వాత ఎస్పీగా గౌతమి సాలి బాధ్యతలు చేపట్టారు. తాడిపత్రి ఘటనల వైఫల్యాన్ని లోతుగా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఏఆర్ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిని పిలిచి గౌతమి సాలి వివరణ కోరారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డి పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. దీంతో లక్ష్మీనారాయణ రెడ్డిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో డీజీపీ కార్యాలయానికి ఆయనను సరెండర్ చేసినట్లు తెలుస్తోంది.
కాగా, ఇప్పటికే ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. పలువురు ఉన్నతాధికారులను సస్పెండ్ చేయడంతోపాటు మరికొందరిని బదిలీలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక, ఇప్పుడు ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రతను పెంచడంతోపాటు హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications