Current Bill Payments: మళ్లీ ఫోన్ పే, గూగుల్ పేతో కరెంటు బిల్ పేమెంట్స్-డిస్కమ్ ల యూటర్న్..!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న విద్యుత్ సంస్థలు రెండు నెలల క్రితం విద్యుత్ బిల్లుల చెల్లింపుల్ని యూపీఐ విధానంలో నిలిపేశాయి. రిజర్వ్ బ్యాంక్ అమల్లోకి తెచ్చిన భారత్ పేమెంట్స్ గేట్ వే ను రిజిస్టర్ చేసుకున్న ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ లో మాత్రమే బిల్లులు చెల్లించాలని లేకపోతే తమ వెబ్ సైట్స్, యాప్స్ లోనే బిల్లులు చెల్లించాలని వినియోగదారులకు సూచించాయి. దీంతో వినియోగదారుల్లో గందరగోళం మొదలైంది.
అప్పటివరకూ ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటి యూపీఐ పేమెంట్స్ యాప్స్ ద్వారా చాలా సులువుగా కరెంటు బిల్లులు చెల్లించిన వినియోగదారులు ఇవి అందుబాటులో లేకపోవడంతో కరెంటు ఆఫీసులకు పరుగులు తీయాల్సి వచ్చింది. అవగాహన ఉన్న వారు మాత్రం ఆయా విద్యుత్ సంస్థల యాప్స్ లో లేదా వెబ్ సైట్లలో బిల్లులు చెల్లించారు. కానీ మిగతా వారు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ గందరగోళం కారణంగా గత రెండు నెలల బిల్లుల వసూళ్లపై తీవ్ర ప్రభావం పడింది.

విద్యుత్ సంస్థలు తాము తెచ్చిన విధానంతో వినియోగదారుల్లో గందరగోళం తలెత్తి బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయని త్వరగానే గ్రహించాయి. దీంతో యూటర్న్ తీసుకున్నాయి. ఎప్పటిలాగే మీకు నచ్చిన ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే లేదా మరే ఇతర యూపీఐ యాప్ ద్వారా అయినా పేమెంట్స్ చేసుకోండని వినియోగదారులకు సూచిస్తున్నాయి. అయితే ఓసారి మారిపోయిందని తెలిసిన తర్వాత తిరిగి పాత విధానానికి వచ్చి కరెంటు బిల్లులు చెల్లించాలన్నా వినియోగదారులకు ఇబ్బందే. దీంతో విద్యుత్ సంస్థల సూచనల్ని వినియోగదారులు ఏమేరకు అమలు చేస్తారో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications