
'లైగర్' లో ఇద్దరు NRIల పెట్టుబడి? విజయ్ దేవకొండ కూడా??
విలక్షణ దర్శకుడు పూరి జగన్నాథ్, యంగ్ హీరో విజయ్ దేవరకొండల కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ లైగర్ వారిద్దరి కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్, ఛార్మి.. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, అపూర్వా మెహతాతో కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఫెయిల్యూర్ కావడంతో పూరీ జగన్నాథ్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. డిస్ట్రిబ్యూటర్లు తమ డబ్బులు తిరిగివ్వాలంటూ పూరీపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు.

విజయ్ దేవరకొండ పెట్టుబడి పెట్టారా?
దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. ఇంత వివాదానికి ప్రధాన కారణం ఈ సినిమాకు పెట్టుబడిని హవాలా రూపంలో సమకూర్చుకోవడమేనని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తోంది. పూరీ జగన్నాథ్, ఛార్మిని విచారించిన ఈడీ విజయ్ దేవరకొండను సుదీర్ఘంగా 9 గంటలపాటు విచారించింది. సినిమాకు తీసుకున్న పారితోషికంతోపాటు, పంపిణీ హక్కుల్లో భాగస్వామ్యం ఉందనే కోణంలో విచారణ జరిగింది. సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యారా? అనే కోణంలో కూడా విజయ్ ను ఈడీ విచారించింది.

ముందు దుబాయ్ పంపించి ఆ తర్వాత భారత్ కు రప్పించారు!
సినిమాకు అవసరమైన నగదును దుబాయ్ పంపించి వాటిని హవాలా రూపంలో తిరిగి భారత్ కు రప్పించి లైగర్ పై పెట్టుబడి పెట్టారనేది ఈడీ అనుమానం. అలాగే అమెరికాలోని తెలుగువారి కోసం పనిచేసే ఒక సంస్థలో పనిచేసే ఇద్దరు ఎన్నారైల పేర్లు కూడా తాజాగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరూ లైగర్ సినిమాలో మైక్ టైసన్ కు డబ్బులు చెల్లించేందుకు హవాలా రూపంలో డబ్బులు సమకూర్చారని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయం ఎన్నారై వర్గాల్లో తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. కొందరు రాజకీయ నాయకులు మనీ లాండరింగ్ ద్వారా లైగర్ లో పెట్టుబడులు పెట్టారనే అనుమానాలున్నాయి. త్వరలోనే కరణ్ జోహార్, అపూర్వ మెహతాలకు నోటీసులు జారీచేసి విచారణ చేయబోతున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంకు, లైగర్ కు సంబంధముందా?
మైక్ టైసన్ రెమ్యునరేషన్ అంశాన్నే ఈడీ ప్రధానంగా తీసుకుంటోంది. ఈ సినిమా పై భారీగా పెట్టుబడి పెట్టడంతోపాటు ప్రచారానికి కూడా పరిమితుల్లేని వ్యయాన్ని చేశారు. దీంతో ఆదాయపు పన్ను శాఖ, ఈడీ దృష్టి ఈ సినిమాపై దృష్టిసారించాయి. తెలంగాణకు చెందిన ఒక పారిశ్రామికవేత్త కూడా పెట్టుబడి పెట్టినట్లు ఈడీ గుర్తించింది. అంతేకాకుండా ఢిల్లీ లిక్కర్ స్కాంకు, లైగర్ సినిమా పెట్టుబడులకు లింకు ఉందా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. చివరకు డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా పూరీ జగన్నాథ్ కన్నా విజయ్ దేవరకొండ కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించింది. అందుకు కారణం.. సినిమా ప్రమోషన్ల సమయంలో అతను వ్యవహరించిన విధానం.