శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక: కోవిడ్ వ్యాక్సినేషన్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి
చిత్తూరు: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ముఖ్య గమనిక. తాజాగా, టీటీడీ తీసుకున్న నిర్ణయాలను తెలుసుకుని శ్రీవారి దర్శనానికి బయల్దేరితే మంచిది. అవేమంటే.. దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించడం జరుగుతుందని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.

శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక
అంతేగాక, కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 72 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. పలువురు భక్తులు దర్శన టికెట్లు లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తుండటంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద సిబ్బంది తనిఖీ చేసి వెనక్కు పంపుతున్నారు. ఈ క్రమంలో భక్తులు ఈ విషయాలను గమనించి టిటిడికి సహకరించాలని అధికారులు కోరారు. టికెట్లు లేకుండా ఆనేకమంది భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తుండటంతో టీటీడీ ఈ విధంగా మరోసారి ప్రకటన చేసింది. చిత్తూరు జిల్లాతోపాటు ఏపీ వ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా కరోనా కొత్త కేసులు తక్కువగానే నమోదవుతున్నప్పటికీ కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని టీటీడీ నిర్ణయించింది.

ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
మరోవైపు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కోవిడ్ నిబంధనలను అనుసరించి అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 7వ తేదీ నుంచి 15 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మంగళవారం శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నెల 6న సాయంత్రం 6 గంటలకు ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. 15వ తేదీన రాత్రి ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కరోనా దృష్ట్యా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా టీటీడీ అధికారులు నిర్వహించనున్నారు.

అక్టోబరు 7 నుండి 14వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం
రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి కలిపి రోజుకు వెయ్యి మంది చొప్పున వెనుకబడిన వర్గాల భక్తులకు అక్టోబరు 7 నుండి 14వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం చేయించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. వీరికి తిరుమల శ్రీవారి దర్శనంతోపాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేయించడం జరుగుతుంది.
Recommended Video

హిందూ ధర్మ రక్షణ కోసం..
హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేందుకు, మత మార్పిడులను అరికట్టేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖతో కలిసి సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీటీడీ మొదటి విడతలో రూ.25 కోట్లతో 13 జిల్లాల్లో 502 ఆలయాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ ఆలయాలు నిర్మించిన వెనుకబడిన ప్రాంతాల నుండి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులను ఆహ్వానించి శ్రీవారి దర్శనం చేయించడం జరుగుతుంది. ఒక్కో జిల్లా నుండి 10 బస్సులు ఏర్పాటుచేసి భక్తులను ఉచితంగా తిరుమలకు తీసుకురావడం జరుగుతుంది. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో 20 బస్సులు ఏర్పాటు చేయడమైనది. ఒక్కో బస్సులో ఇద్దరు సమరసత సేవా ఫౌండేషన్ ప్రతినిధులు ఉంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు స్థానిక దాతల సహకారంతో భోజనాలు అందించేందుకు టిటిడి ఏర్పాట్లు చేపట్టింది.












Click it and Unblock the Notifications