తిరుమలలో సేవలకు ముందుకు రండి, టీటీడీ ఈవో - ఆలయం సమీపంలో విమానం..!!
Tirumala: వేసవిలో శ్రీవారి ఆలయంతోపాటు క్యూలైన్లలో భక్తులకు సేవలందించేందుకు యువకులు ముందుకు రావాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. వేసవి సెలవుల నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీ బ్రేక్ దర్శనాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో మరోసారి విమాన సంచారం కలకలం సృష్టించింది. మే నెలలో 23.38 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా ప్రత్యేక ఏర్పాట్లు..దర్శనం విషయంలో చర్యలు తీసుకున్నామని ఈవో వెల్లడించారు.
దర్శనం కోసం ఓపికతో ఉండండి:వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ లోని అన్ని విభాగాలు సమన్వయంతో సేవలందిస్తున్నాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. అధిక రద్దీ నేపథ్యంలో భక్తులు ఓపికతో ఉండి శ్రీవారిని దర్శించుకోవాలని కోరారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులు ఓపికగా ఉండాలని సూచించారు. వేసవి సెలవుల నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకుని జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశాం. సుప్రభాత సేవ విచక్షణ కోటా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల భద్రత కోసం ఘాట్ల ప్రయాణంలో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.

బ్రేక్ దర్శనాల్లో మార్పు:టీటీడీ చరిత్రలో తొలిసారిగా అధికారులు, ఉద్యోగులందరూ సుందర తిరుమల-శుద్ధ తిరుమల పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొన్నారని వివరించారు. ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.600 కోట్ల విలువైన 10 ఎకరాల భూమిని మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి అప్పగించిందని చెప్పారు. ఇందులో రేమాండ్స్ అధినేత గౌతమ్ సింఘానియా రూ.వంద కోట్లతో ఆలయ నిర్మాణానికి ముందుకు రాగా, ఈ నెల 7వ తేదీన భూమి పూజ నిర్వహిస్తున్నామని వవరించారు. జమ్మూలోని మజీన్ గ్రామంలో నిర్మించిన శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణ ఈ నెల 8వ తేదీన జరుగుతుందన్నారు. తిరుపతిలోని పద్మావతి హృదయాలయంలో 20 నెలల వ్యవధిలోనే 1,450 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు నిర్వహించినట్లు వివరించారు. మే నెలలో 23.38 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా, హుండీ కానుకలు రూ.109.99 కోట్లు ఆదాయం వచ్చినట్లుగా ఈవో ధర్మారెడ్డి వివరించారు.
శ్రీవారి అలయం సమీపంలోకి విమానం:తిరుమలలో మరోసారి విమాన సంచారం కలకలం సృష్టించింది. తిరుమల క్షేత్రానికి అతి సమీపంలో విమానం ప్రయాణించడం చర్చనీయాంశమైంది. ఆదివారం ఉదయం 8.30 గంటల సమయంలో విమానం క్షేత్రం మీదుగా ప్రయాణించింది. సాధారణంగా ఆలయంపై విమానాలు ప్రయాణించకూడదనే ఆగమ నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఓ విమానం తిరుమల ఆలయానికి సమీపంలో ప్రయాణించడం కలకలం రేగింది. తిరుమలలో ఎక్కువ రద్దీ ఉన్న సమయంలో టోకెన్ లేకుండా దర్శనానికి వచ్చిన భక్తులు శ్రీవారి దర్శనం కోసం దాదాపు 2 రోజుల పాటు వేచి ఉండాల్సి వస్తుందని ఈవో వివరించారు. తిరుమల ఘాట్‌రోడ్లలో ఇటీవల డ్రైవర్ల నిర్లక్ష్యం, వాహనాల కండీషన్ బాగా లేనందు వల్ల కొన్ని ప్రమాదాలు జరిగాయని చెప్పారు.












Click it and Unblock the Notifications