కవిత ఇష్యూ: ఆందోళనలకు ఎర్రబెల్లి పిలుపు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు గురువారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యులను సభాపతి వారం రోజుల పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి మాట్లాడారు. కేసీఆర్ హిట్లర్ కన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్వేలో కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెండుచోట్ల తన వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకున్నారని, దీని పైన సమాధానం ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారన్నారు.

దీని పైన ప్రభుత్వం సభలో చెప్పాల్సి ఉందన్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పకుండా రెండురోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరగకుండా గందరగోళం సృష్టిస్తోందన్నారు. ప్రజల సమస్యల పైన నిలదీస్తామనే తమను సభ నుండి వారం పాటు సస్పెండ్ చేశారన్నారు.
ప్రభుత్వమే కాదు స్పీకర్ కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం, స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు నిర్ణయం తీసుకుంటామన్నారు. కేసీఆర్ కూతురు గురించి ప్రశ్నించవద్దా అన్నారు. తమ సస్పెన్షన్‌కు నిరసనగా రేపు తెలంగాణవ్యాప్త ఆందోళనలకు పిలుపునిస్తున్నట్లు ఎర్రబెల్లి చెప్పారు. తమ అక్రమ సస్పెన్షన్ పైన రేపు గవర్నర్‌ను కలుస్తాని చెప్పారు.












Click it and Unblock the Notifications