ఈ రాత్రికి సాకారం: కడియం, కెసిఆర్ విజ్ఞత: ఎర్రబెల్లి
హైదరాబాద్: తమ ప్రభుత్వం కేంద్రంతో స్నేహపూర్వకంగా నడుచుకుటుందని వరంగల్ ఎంపి కడియం శ్రీహరి ఆదివారం అన్నారు. ప్రజలు కలలు కన్న తెలంగాణ ఈ రాత్రికి సాకారం కాబోతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడుల ఒత్తిడి వల్లనే పోలవరం ఆర్డినెన్స్ వచ్చిందని చెప్పారు. పోలవరం ముంపు గ్రామాల పైన ఇద్దరు నాయుళ్లు కుట్ర పన్నారన్నారు.
దేశం మొత్తం మోడీ గాలి వీచినా తెలంగాణలో తెరాస ప్రభంజనం కనిపించిందన్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఎంపీలతో కలసి లోకసభలో పోరాడుతామన్నారు. ముంపు మండలాలను సీమాంధ్రలో కలుపుతున్నట్లు తెలంగాణ బిల్లులో లేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు.

కెసిఆర్ విజ్ఞత: ఎర్రబెల్లి
తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు గానీ, తమకు గాని కెసిఆర్ ప్రమాణ స్వీకారానికి ఆయన నుండి వ్యక్తిగతంగా ఆహ్వానం అందలేదని తెలంగాణ టిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నర్సింహులు, ఎల్ రమణ అన్నారు. ఆహ్వానిస్తారా, లేదా అన్నది కెసిఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
విజయవాడలో పార్టీ ఆఫీస్: వట్టి
రాష్ట్రం రెండుగా విడిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నేత వట్టి వసంత్ కుమార్ తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో జూన్ రెండు లేదా మూడో వారంలో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications