ఇది బాబు, అది కెసిఆర్: ముక్కు రాయాలని ఈటెల
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ సోమవారం సవాల్ విసిరారు. చంద్రబాబుకు దమ్ముంటే తమ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యవసాయ క్షేత్రానికి వచ్చి ఎంత దిగుబడి వస్తుందో చూసుకోవచ్చన్నారు. తమ లెక్క తప్పయితే తాము ముక్కు నేలకు రాసేందుకు సిద్ధమని, కెసిఆర్‌ది కరెక్టు అయితే మీరు ముక్కు నేలకు రాస్తారా అని ప్రశ్నించారు.
కెసిఆర్ కల్చర్ వ్యవసాయమైతే, చంద్రబాబుది ఫాంహౌస్ కల్చర్ అన్నారు. బాబు రైతు ద్వేషి అయితే, కెసిఆర్ వ్యవసాయ ప్రేమికుడని, తమ నేత మట్టిని నమమ్ముకుంటే, చంద్రబాబు వ్యాపారాన్ని నమ్ముకున్నారని ధ్వజమెత్తారు. రెండెకరాల నుండి రెండువేల కోట్లకు చంద్రబాబు ఎలా ఎదిగారో చెప్పాలన్నారు.
కెసిఆర్ పుట్టింది, పెరిగింది వ్యవసాయ కుటుంబంలోనే అన్నారు. వ్యవసాయం దండుగ అని చంద్రబాబు అంటే కెసిఆర్ వ్యవసాయం పండుగ అని నిరూపించారన్నారు. కంప్యూటర్ యుగమైనా, రాకెట్ యుగమైనా అన్నం వచ్చేది వ్యవసాయం నుండే అన్నారు. సామాన్య ప్రజల బతుకులను బాబు అర్థం చేసుకోలేకపోయారన్నారు. బషీర్ బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించి చంపించాడన్నారు.

ముగ్గురు రైతులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అని ఆరోపించారు. బాబు తొమ్మిదేళ్ల పాలనలో ఏనాడు వర్షాలు పడలేదన్నారు. చంద్రబాబు, టిడిపి తిరస్కరించబడ్డ పార్టీ, తిరస్కరించబడ్డ నాయకుడన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ ప్రారంభమయిందని స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పడం శుభపరిణామమని ఈటెల, హరీష్ రావులు అన్నారు అసెంబ్లీలో తెలంగాణపై చర్చ జరిగేలా స్పీకర్ చర్యలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications