తక్కువేంకాదు, రెండ్రోజుల్లో తేలనుంది: ఫలితాలపై ఈటెల
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాల పైన తెలంగాణ రాష్ట్ర సమితి సోమవారం స్పందించింది. సీమాంధ్ర పార్టీల ప్రలోభాలు తట్టుకొని తాము ఈమేరకు విజయం సాధించడం తక్కువేమీ కాదని తెరాస నేత ఈటెల రాజేందర్ అన్నారు. తెరాసకు మద్దతు పలికిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
మూడు రోజుల్లో ఎవరి భవిష్యత్తు ఏమిటో తెలిసిపోతుందన్నారు. రేపటి జెడ్పీటిసి, ఎంపిటిసి, మే 16నాటి ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో తమదే గెలుపు అన్నారు. తెలంగాణలో తప్పకుండా తెరాస ప్రభుత్వం ఏర్పడుతుందని ధఈమా వ్యక్తం చేశారు. తెరాస అధికార దుర్వినియోగాన్ని, ధన ప్రవాహాన్ని అడ్డుకుందని చెప్పారు.

పార్టీ తరఫున తాము స్థానిక ఎన్నికలలో ప్రచారం చేయలేదని చెప్పారు. తమది అప్పుడు ఫక్తు రాజకీయ పార్టీ కాదని, తెలంగాణ సాధించడం పైనే తాము దృష్టి సారించామని చెప్పారు. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు, తెలంగాణవాదానికి, ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు.
తమ పార్టీని ఇక పైన రాజకీయంగా పటిష్టం చేయడం పైన తాము దృష్టి సారిస్తామని చెప్పారు. మే 16న తాము విజయ దుందుభిమోగిస్తామన్నారు. మే 16న ఎవరిది బలుపో, ఎవరిది వాపో తెలిసిపోతుందన్నారు. మున్సిపల్ ఎన్నికలు స్థానికత ఆధారంగా జరిగాయన్నారు.
నూటికి నూరు శాతం ఎంపి, ఎమ్మెల్యే, జెడ్పీటీసి, ఎంపీటిసి ఎన్నికల్లో తెరాస విజయం ఖాయమన్నారు. సీమాంధ్ర పార్టీలు ప్రలోభాలకు గురి చేసిన తెలంగాణ ప్రజలు తెరాస వైపు మొగ్గారన్నారు. మెజార్టీ మున్సిపల్ చైర్మన్ స్థానాలు తామే గెలుచుకుంటామని చెప్పారు. కాంగ్రెసు వెకిలి మాటలను ప్రజలు తిప్పి కొడతారన్నారు.












Click it and Unblock the Notifications