నా పాత్రే: బడ్జెట్‌పై ఈటెల, నిషేధించిన చోటే: హరీశ్
హైదరాబాద్: బడ్జెట్ రూపకల్పనలో తన పాత్ర లేదనే ప్రచారాన్ని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కొట్టిపారేశారు. సంక్షేమం, అభివృద్దే తమ బడ్జెట్ ట్యాగ్ లైన్‌లని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తొలి బడ్జెట్‌లో పన్నులు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. రేపు బుధవారంనాడు ఆయన తెలంగాణ ప్రభుత్వ తొలి బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు.
తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్‌ను బుధవారం (5వ తేదీ) ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ ఆధ్యక్షతన కేబీనెట్ సమావేశం జరుగనుంది. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆమోదించనున్నారు. ఎక్కడ ఏమి చేయదలచుకున్నామో అన్నీ సభలో వివరిస్తామని అన్నారు.
రూ. 35 వేల కోట్లతో జెన్‌కో ఆధ్వర్యంలో కరెంట్ ఉత్పత్తికి ఉపయోగిస్తామని, రూ. 25 వేల కోట్లతో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి నీరు ఇచ్చే పథకం ప్రవేశపెడతామని, రూ. 10 వేల కోట్లు రోడ్ల మరమ్మత్తు కార్యక్రమానికి కేటాయిస్తామని ఆయన తెలిపారు. పెన్షన్లు ఇలా దేనికి ఇబ్బంది లేకుండా బడ్జెట్ రూపొందించినట్లు మంత్రి ఈటెల రాజేందర్ ఓ ప్రముఖ దినపత్రికతో తెలిపారు.

తమ ప్రభుత్వం ప్రజోపయోగకరమైన బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందని ఆయన మీడియాతో చెప్పారు. ప్రతిపక్షాలు కూడా సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు. ప్రతిపక్షాలు చర్చ జరగకూడదని కోరుకుంటాయి గానీ తమ ప్రభుత్వం అన్ని అంశాలపై చర్చకు సిద్దంగా ఉందని చెప్పారు.
తెలంగాణ పదాన్ని నిషేధించిన చోటనే లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రతిపాదించడం సంతోషంగా ఉందని నీటి పారుదల, శాసనసభా వ్యవహారాల మంత్రి టి. హరీశ్ రావు చెప్పారు. సభను ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయంపై రేపు నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. అన్ని అంశాలపై చర్చకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు.
సీమాంధ్ర నేతల కోసం కొంత మంది సభను తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సీమాంధ్ర నాయకత్వంలో పనిచేసే తెలంగాణ నాయకులను చరిత్ర క్షమించబోదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications