జగన్ సాక్ష్యంతో పిన్నెల్లి బుక్ అయినట్లే ! మంత్రి ఆనం కామెంట్స్..
ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్ తాజాగా నెల్లూరు జైల్లో ఉన్న ఈవీఎం ధ్వంసం కేసు నిందితుడు, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. నిర్ణీత ములాఖత్ లు అయిపోయినా పిన్నెల్లిని కలిసేందుకు జగన్ జైలుకు వెళ్లడం, ప్రభుత్వం ప్రత్యేక అనుమతితో ఆయన ములాఖత్ కు అనుమతించడం జరిగాయి. అయితే జైలు బయటికి వచ్చిన జగన్.. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేయడం కరెక్టే అన్నట్లుగా మాట్లాడారు.
ఎన్నికల సందర్భంగా మాచర్లలోని పాల్వాయ్ గేట్ పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి అక్కడ ఈవీఎం ధ్వంసం చేసిన వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన్ను పరామర్శించేందుకు వెళ్లిన జగన్... పోలింగ్ సందర్భంగా అంతా కరెక్టుగా ఉంటే ఈవీఎం ధ్వంసం చేయాల్సిన అవసరం ఎందుకొస్తుందంటూ ప్రశ్నించారు. తద్వారా ఈవీఎం ధ్వంసాన్ని సమర్థించారు. పిన్నెల్లిపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఆయన మెడకు చుట్టుకోబోతున్నాయి.

జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు స్పందిస్తూ.. జగన్ పిన్నెల్లి కేసులో సాక్ష్యం చెప్పినట్లుగా అభివర్ణించారు. ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ పిన్నెల్లి వ్యవహారంలో సాక్ష్యం చెప్పేసారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తేల్చేసారు. జగన్ స్వయంగా పిన్నెల్లి ఈవీఎం పగులగొట్టినట్లు అంగీకరించారని, కాబట్టి ఈ సాక్ష్యంతో పిన్నెల్లిపై కేసు బలపడుతుందన్నారు.
పిన్నెల్లి తప్పుచేశాడని, ఆయన్ను చట్టపరంగా, న్యాయపరంగా శిక్షించారని జగన్ కోరినట్లుందన్నారు. జగన్ టూర్ పిన్నెల్లిని పరామర్శించడానికి కాదని, ఆయన్ను మరింతగా ఇరికించేందుకే అన్నట్లుగా ఉందని ఆనం వ్యాఖ్యానించారు. వైసీపీ ఏపీలో మనుగడ సాగించలేదని జగనే స్వయంగా చెప్పేశారన్నారు.












Click it and Unblock the Notifications