Pinnelli Bail Petition: హైకోర్టులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ -కాసేపట్లో విచారణ..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాచర్లలోని పోలింగ్ కేంద్రంలో దూరి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో ఏ1గా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్నారు. ఆయన కోసం ఏపీ, తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కాసేపట్లో విచారణ జరగనుంది.

మే 13న మాచర్లలో పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో భాగంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయ్ గేట్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి అక్కడి ఈవీఎంను ధ్వంసం చేసారు. కారణాలు ఏవైనా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేయడం నేరమే కాబట్టి ఈసీ ఆదేశాల మేరకు మూడు చట్టాల్లోని 10 సెక్షన్ల కింద పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదు చేసారు. ఇదంతా ముందే ఊహించిన పిన్నెల్లి హౌస్ అరెస్టు నుంచి హైదరాబాద్ కు పారిపోయారు.
అనంతరం పిన్నెల్లి హైదరాబాద్ లో ఉన్నట్లు సమాచారం రావడంతో ఏపీ-తెలంగాణ పోలీసులు ఉమ్మడిగా గాలింపు చేపట్టారు. ఇందులో రుద్రారం వద్ద ఆయన కారును వదిలి పరారయ్యారు. తాజాగా ఆయన తమిళనాడు పారిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన దేశం వదిలి పారిపోతారన్న సమాచారంతో లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. దీంతో జల మార్గంలో తమిళనాడు నుంచి పారిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఇచ్చే తీర్పు కీలకంగా మారింది.












Click it and Unblock the Notifications